ఏప్రిల్‌ 1 నుంచి బీహార్‌లో మద్యం నిషేధం  • దశలవారీ అమలుకు రంగం సిద్ధం

బీహార్‌లో ఏప్రిల్‌ 1 నుంచి మద్య నిషేధాన్ని దశలవారీగా అమలులోకి తేవడానికి అధికారులు సిద్ధమయ్యారు. ఐఎంఎఫ్‌ఎల్‌ (స్వదేశంలో తయారయ్యే విదేశీ మద్యం) టెండర్ల విషయంలో తలెత్తిన గందరగోళానికి తెర దించుతూ అధికారులు ఈ మద్యం పట్టణాలకే పరిమితమని స్పష్టం చేశారు. మొదటి దశలో దేశవాళీ మద్యాన్ని రాష్ట్రవ్యాప్తంగా నిషేధిస్తామని, ఆరు నెలల తర్వాత రెండో దశలో ఐఎంఎఫ్‌ఎల్‌పై నిషేధం విధిస్తామని తెలిపారు. అంతకు ముందు, గురువారం నాడు స్థానిక దినపత్రికలలో ఐఎంఎఫ్‌ఎల్‌కు సంబంధించిన టెండర్లను ప్రచురించారు. అయితే ఈ రిటైల్‌ దుకాణాలు గ్రామీణ ప్రాంతంలో ఉండవని అధికారులు తెలిపారు. గతంలో ప్రభుత్వం కేవలం టోకు వ్యాపారానికే పరిమితం కాగా, ఇప్పుడు రిటైల్‌ దుకాణాలను నిర్వహిస్తుందని తెలిసింది. దీనితో ప్రభుత్వానికి 15 శాతం అదనపు లాభం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వ నిర్వహణలో నడిచే దుకాణాల సంఖ్య 656కు మించదని, పాట్నా, ముజఫర్‌పూర్‌, గయా వంటి పెద్ద నగరాల్లో అత్యధికంగా 10 దుకాణాలు, మధుబని, భాగల్‌పూర్‌, దర్భంగా వంటి ఓ మోస్తరు పట్టణాల్లో దుకాణాలు 4కు మించవని రాష్ట్ర ఎక్సైజ్‌ శాఖ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో 6 వేల రిటైల్‌ దుకాణాలున్నాయి. నవంబర్‌ 26న, రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌ రాష్ట్రంలో సంపూర్ణ మద్య నిషేధంపై ప్రకటన చేసిన విషయం విదితమే. కొత్త మద్యం విధానాన్ని రూపొందించాలని తాను అధికారులను కోరానని నితీశ్‌ అన్నారు. డిసెంబర్‌ చివరి వరకు నూతన విధానాన్ని పరిశీలించి, తన చిరకాల స్వప్నమైన మద్య నిషేధాన్ని అమలులోకి తేవడానికి నిర్ణయం తీసుకుంటానని ఆయన చెప్పారు. కాగా, రెండు రోజుల క్రితం రాష్ట్రంలోని మద్యం వ్యాపారుల ప్రతినిధివర్గం ఆర్‌జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ను కలిసి, ఇందులో జోక్యం చేసుకోవాలని ఆయనను కోరింది. అయితే, ప్రభుత్వ నిర్ణయాన్ని లాలూ సమర్థించినట్టు తెలిసింది. ఒకవైపు మద్య నిషేధం అంటూనే మరోవైపు రిటైల్‌ దుకాణాలకు సంబంధించి టెండర్‌ జారీ చేయడాన్ని బీజేపీ తప్పు పట్టింది. ప్రభుత్వానికి సంకల్పశుద్ధి లోపించిందని సుశీల్‌ కుమార్‌ మోడీ ట్వీట్‌ చేశారు. మద్య నిషేధాన్ని దశలవారీగా అమలులోకి తేనున్నామని రాష్ట్ర ఎక్సైజ్‌, నిషేధం మంత్రి అబ్దుల్‌ జలీల్‌ మస్తాన్‌ అన్నారు.


Post a Comment

0 Comments