2 కోట్ల 50 లక్షలు


  • చేరనున్న కాన్సర్‌ బాధితుల సంఖ్య
  • 20 ఏళ్లలో 75 శాతం పెరగనున్న  కేసులు  

     వచ్చే 20 ఏండ్లలో ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్‌ బాధితుల సంఖ్య 75 శాతం పెరిగి 2 కోట్ల 50 లక్షలకు చేరుతుందని అవనీషలింగం మహిళా విశ్వవిద్యాలయం చాన్సలర్‌ డా|| పిఆర్‌ కృష్ణకుమార్‌ అన్నారు. అమెరికాకు చెందిన ఓహివో స్టేట్‌ యూనివర్సిటీతో కలిసి క్యాన్సర్‌ పరిశోధనపై ఏర్పాటు చేసిన సదస్సులో ఆయన ప్రసంగించారు. ఒక్క 2030లోనే 2 కోట్ల 17 లక్షల క్యాన్సర్‌ కేసులు నమోదు కానున్నాయని, కోటీ 30 లక్షలమంది మృత్యువాత పడనున్నారని కృష్ణకుమార్‌ పేర్కొన్నారు. జనాభా పెరుగుదల ఆధారంగానే ఈ అంచనా వేశామని ఆయన తెలిపారు. ప్రస్తుతం, ప్రతియేటా దాదాపు కోటీ 10 లక్షల కేసులు నమోదవుతుండగా, 70 లక్షలమంది మృతి చెందుతున్నట్టు ఆయన తెలిపారు. మృతుల్లో సగంమంది అభివృద్ధి చెందుతున్న దేశాల్లోనే అని ఆయన అన్నారు. ప్రపంచంలో జరిగే ప్రతి ఏడు మరణాల్లో ఒకరు క్యాన్సర్‌ కారణంగానే అని ఆయన పేర్కొన్నారు. ఎయిడ్స్‌, టీబీ, మలేరియా వల్ల జరిగే మొత్తం మరణాలకన్నా ఈ సంఖ్య అధికమని కృష్ణకుమార్‌ తెలిపారు. ఈ సదస్సులో ఎముకల్లో వచ్చే 'ఈవింగ్‌ సర్కోమా' పై ప్రముఖ క్యాన్సర్‌ వైద్యుడు డా|| టి రాజ్‌కుమార్‌ తన పరిశోధనా పత్రాన్ని ప్రవేశపెట్టారు. దీని నివారణకు రాజ్‌కుమార్‌ బృందం ఓ పెప్టయిడ్‌ను అభివృద్ధి చేసింది. ఇది సంలీన మాంసకృత్తిగా వ్యవహరిస్తూ క్యాన్సర్‌ కణాల వృద్ధిని అడ్డుకుంటుంది.Post a Comment

0 Comments