జనవరి 5న తీర్పు  • బీసీసీఐ క్రమశిక్షణ కమిటీ ముందు హాజరైన అజిత్‌ చండీలా, హికెన్‌ షా

ఐపీఎల్‌ స్ఫాట్‌ ఫిక్సింగ్‌ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజస్తాన్‌ రాయల్స్‌ ఆటగాడు అజిత్‌ చండీలా, హికెన్‌ షా గురువారం బీసీసీఐ క్రమశిక్షణ కమిటీ ముందు హాజరయ్యారు. బీసీసీఐ బాస్‌ శశాంక్‌ మనోహర్‌, జ్యోతిరాదిత్య సింధియా, నిరంజన్‌ షా సహా యాంటీ కరప్షన్‌ వింగ్‌ చీఫ్‌ రవి సావంత్‌లు వీడియో కాన్ఫరెన్స్‌లో చండీలా, హికెన్‌లను ప్రశ్నించారు. 'విచారణ సందర్భంగా ఢిల్లీ పోలీసులు అడిగిన ప్రశ్నలే మళ్లీ బీసీసీఐ కమిటీ అడిగింది. వారికి చెప్పిన సమాధానమే మళ్లీ వీరికీ చెప్పాను. బోర్డు కమిటీపై పూర్తి నమ్మముంది. నిర్దోషిగా బయటపడతాననే విశ్వాసమంది' అని అజిత్‌ చండీలా పేర్కొన్నాడు. చండీలా.. శ్రీశాంత్‌, అంకిత్‌ చౌహాన్‌తో పాటు ఇదివరకే బోర్డు నుంచి జీవిత కాల సస్పెన్షన్‌ ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. కాగా ముంబయి రంజీ క్రికెటర్‌ హికెన్‌ షాపై ఐపీఎల్‌లో ఆడుతున్న రంజీ సహచర ఆటగాడిని ఫిక్సింగ్‌కు పాల్పడాల్సిందిగా ఆఫర్‌ చేశాడనే ఆరోపణలు ఉన్నాయి. అజిత్‌, హికెన్‌ వాదనలు విన్న విచారణ కమిటీ.. లిఖిత పూర్వక సమాధానం ఇచ్చేందుకు జనవరి 4వ తేది వరకూ గడువు విధించింది. అదేవిధంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న పాకిస్తాన్‌ అంపైర్‌ అసద్‌ రవూఫ్‌కు సైతం కమిటీ నోటీసు జారీ చేసింది. జనవరి 5న మళ్లీ భేటీ కానున్న క్రమశిక్షణ సంఘం.. వీరిపై తుది నిర్ణయాన్ని వెలువరించనుంది.

Post a Comment

0 Comments