అసెంబ్లీలో అశ్లీలం..!  • ఒడిశాలో అడ్డంగా బుక్కైన కాంగ్రెస్‌ ఎమ్మెల్యే 
  •  మండిపడుతున్న మహిళా సంఘాలు..         చట్టసభల్లో ప్రజా సమస్యలను ప్రస్తావించాల్సిన ప్రజాప్రతినిధులు తమ బాధ్యతలను గాలికొదిలేస్తున్నారు. గతంలో కర్ణాటక అసెంబ్లీలో అశ్లీల చిత్రాలు చూస్తూ అడ్డంగా దొరికిపోతే..తాజాగా ఒడిశాలోనూ ఓ ఎమ్మెల్యే నీలి చిత్రాలు వీక్షిస్తూ చిక్కాడు. ఈ విషయం రాద్ధాంతంగా మారాక కాంగ్రెస్‌ పార్టీ అతన్ని సస్పెండ్‌ చేసింది. స్థానిక టీవీ ఛానల్‌లో వీడియో క్లిప్‌ను ప్రసారం చేసింది.
           సోమవారం శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో కాంగ్రెస్‌ ఎమ్మెల్యే నాబాదాస్‌ స్మార్ట్‌ఫోన్‌తో చాలా బిజీగా కనిపించారు. సభలో అంతగా ఏం చేస్తున్నారని క్లోజప్‌ షాట్‌లో చూస్తే ఏముంది. ఆయన నీలి చిత్రాలు తిలకించటంలో మునిగిపోయాడన్న సంగతి బట్టబయలైంది. ఇది గమనించిన అధికార బీజేడీ ఎమ్మెల్యేలు ఆ ఎమ్మెల్యేపై చర్య తీసుకోవాలంటూ డిమాండ్‌ చేశారు. అసెంబ్లీలో బాధ్యతాయుతంగా మెలగాల్సిన ఎమ్మెల్యే సెల్‌ఫోన్‌లో అలాంటి చిత్రాలు చూడటం క్షమించరానిదని బీజేడీ సీనియర్‌ నాయకురాలు ప్రమీలా మలికా మండిపడ్డారు. ఎమ్మెల్యేపై వేటు వేయటమే కాదు..చట్టపరంగా చర్యలు తీసుకోవాలని మహిళా సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. అయితే, తాను వెబ్‌ పేజ్‌ చెక్‌ చేస్తుండగా, యూట్యూబ్‌ క్లిక్‌ కావటంతో..నీలి చిత్రాలు ప్రత్యక్షమయ్యాయి. అంతే కానీ వాటిని చూడాలనుకోలేదని, తనను ఇరికించటానికి ఇలాంటి కుట్ర చేస్తున్నారని ఎమ్మెల్యే నాబాదాస్‌ ఆరోపించారు. వాస్తవానికి సభ జరుగుతున్నప్పుడు దాస్‌ ఫోన్‌ ఎందుకు ఉపయోగించారన్నది కూడా ప్రశ్నార్థకమే. సభ జరుగుతున్నప్పుడు ఫోన్‌ వాడకూడదనే ఒడిశా అసెంబ్లీ నిబంధనల్లో ఉంది. నీలి చిత్రాలు చూస్తూ అడ్డంగా దొరికిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యే పరువుపోతుందన్న భయంతో నంగనాచి తుంగబుర్రలా బుకాయించే ప్రయత్నం చేస్తున్నారన్నది మాత్రం వాస్తవం.Post a Comment

0 Comments