చైనాలో ప్రముఖ వ్యాపారవేత్త అరెస్టు ?

       
         చైనాకు చెందిన బిజినెస్‌ టైకూన్‌ అదృశ్యం కావడం కలకలం రేపింది. చైనాలో అతిపెద్ద ప్రైవేటు కంపెనీ ఫోసున్‌ ఇంటర్నేషనల్‌ సంస్థ వ్యవస్థాపకుడు గువో గువాంగ్‌ చాంగ్‌ గత రెండు రోజులుగా కనిపించడం లేదు. అయితే అతన్ని చైనా పోలీసులే అరెస్టు చేసి...ఓ షేర్‌ ట్రేడింగ్‌పై విచారణ జరుపుతున్నట్టు శుక్రవారం రాత్రి కంపెనీకి సమాచారం అందింది. గత రెండు రోజులుగా ఆయన ఆచూకీ కోసం కంపెనీ వర్గాలు కలవర పడ్డాయి. అటు హాంగ్‌కాంగ్‌ మార్కెట్లో  ఫోసున్‌  కంపెనీ  తన షేర్ల ట్రేడింగ్‌ నిలిపేసింది. వారెన్‌ బఫెట్‌ అంతటివాడిని కావాలని కలలు కనే గువోను చైనీయులు కూడా ప్రపంచ కుబేరుడు వారెన్‌ బఫెట్‌తో పోలుస్తారు. రెండు రోజుల నుంచి గువో ఆచూకీ లేనట్టు ఆయన కంపెనీ వర్గాలు పేర్కొన్నాయి.
         చైనా పోలీసులు గువోను ఎందుకు నిర్బంధించారన్న విషయం మాత్రం అధికారికంగా ఇంకా తెలియరాలేదు.  చైనాలో అత్యంత సంపన్నుల్లో ఒకరిగా గుర్తింపు పొందిన గువోకి సంబంధించి ఎలాంటి సమాచారం లభించకపోవడంతో కంపెనీ ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది. మరోవైపు గువోను పోలీసులు అరెస్టు చేసి ఉంటారన్న వదంతులు కూడా వ్యాపించాయి. షాంఘై పోలీసులు గువోను అదుపులోకి తీసుకున్నారనే ఊహాగానాలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.  ఓ అవినీతి కేసులో విచారణకు సహకరించని కారణంగా గువోను పోలీసులు అరెస్టు చేసి ఉంటారని భావిస్తున్నారు. కాగా తమ అధినేత అరెస్టు వార్తలపై ఫోసున్‌ కంపెనీ ప్రతినిధుల వైపు నుంచి మాత్రం ఎలాంటి స్పందన రాలేదు.

Post a Comment

0 Comments