తొందరెందుకు.. వేచి చూద్దాం  • ఢిల్లీ వాహన పథకంపై అభ్యంతరాలు తగవన్న హైకోర్టు

            ఆప్‌ ప్రభుత్వం ప్రతిపాదించిన ప్రయివేటు వాహనాల రాకపోకల నియంత్రణపై మధ్యంతర ఆదేశం జారీ చేయడానికి ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. జనవరి 1 నుంచి సరి, బేసి సంఖ్యలున్న ప్రైయివేటు వాహనాలు రోజు విడిచి రోజు మాత్రమే రోడ్ల మీదకు రావాలని కేజ్రీవాల్‌ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పలు ప్రజాహిత వ్యాజ్యాలపై కోర్టు విచారణను వాయిదా వేసింది. ఢిల్లీలో విపరీతంగా పెరిగిపోయిన కాలుష్యాన్ని నివారించేందుకు ప్రయివేటు వాహనాల రాకపోకలను తగ్గించాలని ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. అయితే ప్రభుత్వ వాహనాలు ఈ నియంత్రణ పరిధిలోకి రావు. ప్రయాణికుల రద్దీని తట్టుకునేందుకు డీటీసీ బస్సులను, మెట్రోలను ఎక్కువ సంఖ్యలో నడపాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. శ్వేతా కపూర్‌, సర్వేశ్‌ సింగ్‌లు తమ పిటిషన్‌లో ఈ నిర్ణయాన్ని అమలు చేయకుండా ఢిల్లీ ప్రభుత్వాన్ని అడ్డుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ విజ్ఞప్తిని తోసిపుచ్చుతూ, ప్రధాన న్యాయమూర్తి జీ రోహిణీ, జస్టిస్‌ జయంత్‌ నాథ్‌లతో కూడిన హైకోర్టు ధర్మాసనం ఈ వ్యాజ్యాలు 'అపరిపక్వమైనవి' అని అభివర్ణించింది. 'ఢిల్లీ ప్రభుత్వం ఈ ప్రతిపాదన ముందుకు తెచ్చింది. 2016 జనవరి 1 నుంచి దీన్ని ప్రయోగాత్మకంగా 15 రోజుల పాటు అమలు చేయబోతున్నారు. దీనిపై ఇంకా నోటిఫికేషన్‌ కూడా జారీ కాలేదు. కాబట్టి ప్రభుత్వాన్ని ప్రయత్నించి చూడనివ్వండి' అని ధర్మాసనం అంది. ఇందుకోసం ఢిల్లీ ప్రభుత్వం ప్రజల నుంచి సలహాలు కూడా కోరింది కాబట్టి ఎలాంటి సలహాలు వస్తాయో వేచి చూడడం మంచిదని కూడా ధర్మాసనం అభిప్రాయపడింది. కోర్టు తదుపరి విచారణను డిసెంబర్‌ 23కు వాయిదా వేసింది. ప్రజాహిత వ్యాజ్యాలను ఢిల్లీ ప్రభుత్వంపై ఒత్తిడి చేయడానికి ఉపయోగించకండి అని కూడా ధర్మాసనం సుతిమెత్తగా మందలించింది.


Post a Comment

0 Comments