నైట్‌ క్లబ్‌లోకి బాంబులు విసిరిన దుండగులు  •  ఈజిప్టు రాజధాని కైరోలో ఘటన : 16 మంది మృతి

                    ఈజిప్టు రాజధాని కైరోలో దుండగులు బాంబు దాడులకు పాల్పడ్డారు. నగరం నడిమధ్యన గల అగౌజా ప్రాంతంలోని ఓ నైట్‌ క్లబ్‌ లోపలికి గుర్తు తెలియని వ్యక్తులు బాంబులు విసిరారు. ఈ ఘటనలో 16 మంది మృతిచెందగా...మరో ఐదుగురు గాయపడినట్టు స్థానిక అధికారులు తెలిపారు. సమాచారమందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. మృతులంతా ఈజిప్టు వాసులేనని అధికారులు వెల్లడించారు. ఘటనకు బాధ్యులెవరన్నది ఇంకా తెలియాల్సి వుందని అధికారులు పేర్కొన్నారు. ముసుగు ధరించిన ముగ్గురు దుండగులు నైట్‌ క్లబ్‌ ముందుకు వచ్చి...లోపలికి బాంబులు విసిరేసి వెళ్లిపోయారని స్థానిక మీడియా వార్తలను ప్రసారం చేసింది. భవనం బేస్‌మెంట్‌లో నైట్‌క్లబ్‌ వుండటం...మూలాన ఘటన నుంచి తప్పించుకోవడానికి అవకాశం ఏర్పడలేదని, కాలినగాయాల వల్ల, ఊపిరాడక అనేకమంది చనిపోయారని మీడియా అభిప్రాయపడింది. ఈజిప్టు రాజధాని కైరోలో తరుచూ ఇలాంటి బాంబుదాడి ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. భద్రతాబలగాలపైనా, సాధారణ ప్రజలను లక్ష్యంగా చేసుకొని ఇస్లామిక్‌ స్టేట్‌ ఉగ్రవాదులు దాడులు చేస్తున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 2013లో అధ్యక్షుడు మహమ్మద్‌ మోర్సీని పదవీచ్యుతుణ్ని చేశాక, ఇస్లామిక్‌ అతివాదం తన ఉగ్రరూపాన్ని ప్రదర్శిస్తోంది.


Post a Comment

0 Comments