పూణెలోని ఇన్ఫోసిస్‌ క్యాంపస్‌లో.. మహిళపై అత్యాచారం  • నిందితుల అరెస్టు
  • కోల్‌కతాలో కదులుతున్న రైలులో...

 పూణెలోని ఇన్ఫోసిస్‌ క్యాంపస్‌ క్యాంటిన్‌లో దారుణం జరిగింది. ఒక మహిళపై ఇద్దరు కామాంధులు అఘాయిత్యానికి ఒడిగట్టిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హింజెవాడిలోని రాజీవ్‌గాంధీ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ పార్కు వద్దగల ఇన్ఫోసిస్‌ క్యాంపస్‌లో ఈ దారుణం జరుగగా నిందితులు పరితోష్‌ బాగ్‌ (21), ప్రకాష్‌ కిసాన్‌ మహదిక్‌ (30)లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులిద్దరూ హౌస్‌ కీపింగ్‌ సిబ్బంది అని, క్యాంటీన్‌లో పనిచేస్తున్న మహిళపై అక్కడి వాష్‌ రూంలో వీరిద్దరూ లైంగిక దాడికి పాల్పడినట్టు పోలీసులు చెప్పారు. ఈ ఘటనను వీడియో తీసిన నిందితులు, బయటకు చెపితే దానిని బయటపెడతామని బాధితురాలిని బెదిరించారు. అయితే రెండు రోజుల తర్వాత హింజెవాడి పోలీస్‌ స్టేషన్‌లో ఆమె ఫిర్యాదు చేయడంతో పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. కాగా ఈ ఘటనపై ఇన్ఫోసిస్‌ యాజమాన్యం స్పందించింది. నిందితులిద్దరూ కాంట్రాక్టు ఉద్యోగులని తెలిపింది. కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులకు తాము పూర్తిగా సహకరిస్తామని ఈ మేరకు యాజమాన్యం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.

రైలులో మైనరుపై సైనికుల ఘాతుకం

దేశానికి రక్షణ కవచాలుగా చెప్పుకొనే సైనికులు కొందరు తప్ప తాగి కదులుతున్న రైలులో మైనరుపై దారుణానికి పాల్పడ్డారు. హౌరా-అమృత్‌సర్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలులో ప్రయాణిస్తున్న కొందరు సైనికులు బరితెగించారు. సైనికుల కోసం రిజర్వు చేసిన బోగీలోకి హౌరాలో కోల్‌కతాకు చెందిన 14 ఏండ్ల బాలిక పొరపాటున ఎక్కింది. రెచ్చిపోయిన సైనికులు ఆమెకు బలవంతంగా మందు తాగించారు. అనంతరం ఆమెపై ఇద్దరు సైనికులు లైంగిక దాడికి పాల్పడ్డారు. రైలు జార్ఖండ్‌ మధుపూర్‌ స్టేషన్‌కు చేరుకోగా అపస్మారక స్థితిలో పడివున్న ఆమెను చూసిన కొందరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు బాలికను తల్లిదండ్రులకు అప్పగించారు. 'మైనరుకు బలవంతంగా మందు తాగించిన మంద్రీష్‌ త్రిపాఠిని అరెస్టు చేశాము' అని పోలీసు అధికారి అర్జున్‌ తివారీ చెప్పారు.


Post a Comment

2 Comments