ఉత్తర ఇంగ్లాండ్‌ను వణికిస్తున్న 'డెస్మండ్‌' తుఫాన్‌  • పొంగిపొర్లుతున్న నదులు

               ఉత్తర ఇంగ్లాండ్‌, స్కాట్‌లాండ్‌లోని కొన్ని ప్రాంతాల్లో డెస్మండ్‌ తుఫాన్‌ విధ్వంసం సృష్టిస్తున్నది. ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. నదులన్నీ పొంగిపొర్లుతున్నాయి. దాంతో పలుచోట్ల వరద హెచ్చరికలు జారీ చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అట్లాంటిక్‌ తీరానికి సమీపంలో వున్న ఇంగ్లాండ్‌, వేల్స్‌, దక్షిణ స్కాట్‌లాండ్‌లపై ఈ తుఫాన్‌ ఉగ్రరూపం చూపుతున్నది. బ్రిటన్‌ ప్రభుత్వం దాదాపు 40 రకాల తుఫాన్‌ హెచ్చరికలను జారీ చేసింది. అనేక ప్రాంతాల్లో రోడ్డు, రైలు రవాణా వ్యవస్థను నిలుపదల చేశారు. విద్యుత్‌ పంపిణీకి సంబంధించి ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. విపరీతమైన చలిని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం కొన్ని ఏర్పాట్లు చేసింది. 'అత్యవసర ఫోయిల్‌ బ్లాంకెట్స్‌', 'హాట్‌ డ్రింక్స్‌'ను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చింది.

కుంబ్రియా, లాంక్‌షైర్‌ ప్రాంతాలు ఎక్కువగా తుఫాన్‌ తాకిడి ఎక్కువగా కనపడుతోంది. నెలరోజుల్లో కురిసే వర్షమంతా గత 24 గంటల్లో ఈ ప్రాంతాల్లో కురిసిందని, అనేక ప్రాంతాలు పూర్తిగా నీటమునిగాయని, దీంతో నదులన్నీ పొంగుపొర్లుతున్నాయని అధికారులు వెల్లడించారు. కుంబ్రియాలో డిసెంబరు నెలలో సాధారణంగా వుండే వర్షపాతం 146.1 మిల్లీమీటర్లు. కానీ ఈ తుఫాన్‌ తాకిడి కారణంగా ఒకేరోజు 178.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. కుంబ్రియన్‌ ప్రాంతంలో నదులన్నీ ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. మరోవైపు బలమైన గాలులు ప్రజల్ని తీవ్ర ఇక్కట్లకు గురిచేస్తున్నాయి. గంటకు 140 కిలోమీటర్ల వేగంతో వీస్తున్న గాలుల వల్ల ఆస్తినష్టం కూడా వాటిల్లుతోంది. నదులన్నీ భీకరరూపం దాల్చాయని, దీని ఫలితంగా వరదలు ముంచెత్తుతాయని తాము అంచనావేసామని బ్రిటన్‌ వాతావరణ శాఖ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. సురక్షిత ప్రాంతానికి వెళ్లి భద్రంగా వుండమని కుంబ్రియా, దక్షిణ స్కాట్‌లాండ్‌ ప్రజలకు ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. ఇంతకుముందెన్నడూ లేనంత స్థాయిలో తుఫాన్‌ భయపెడుతోందని వాతావరణ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.


Post a Comment

0 Comments