రియాద్‌లో శాంతి చర్చలు !


        శాంతి చర్చలకు సౌదీ అరేబియా రాజధాని  రియాద్‌ వేదికగా మారనుంది. సిరియాలో చెలరేగిన అంతర్యుద్ధం కారణంగా అక్కడ అశాంతియుత వాతావరణం చోటుచేసుకుంది. దీంతో అనేక మంది సిరియన్లు వేరే ప్రాంతాలకు శరణార్థులుగా   తరలివెళ్తున్న  సంగతి తెలిసిందే.  సిరియా అధ్యక్షుడు అస్సద్‌కు, అతని   ప్రత్యర్థులకు మధ్య జరుగనున్న  ఈ సమావేశం ప్రాధాన్యాన్ని  సంతరించుకుంది.  బుధవారం సిరియాలో జరిగిన ప్రతినిధుల సమావేశంలో   విదేశీ బలగాల మోహరింపుపై సుదీర్ఘ చర్చ జరిగినట్టు సమాచారం. సిరియా నుంచి విదేశీ బలగాలను  బయటకు పంపివేయాలని దాదాపు 100 మంది ప్రతినిధులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ఓ ఒప్పందాన్ని తీసుకురావాలని కోరారు. అంతేగాకుండా, సిరియాలో అంతర్యుద్ధానికి ముగింపు పలికే మార్గాలపై తక్షణమే దృష్టిసారించాలన్నారు. ఉగ్రవాదాన్ని  నిర్మూలించాలనేదే తమ ధ్యేయమని సిరియాలోని  ప్రతిపక్షం కోరుతోంది. కాగా, జెనీవాలో  గత రెండేళ్ల కిందటే శాంతి చర్చలు జరిపేందుకు  ప్రయత్నం జరిగింది. కానీ అప్పట్లో ఐఎస్‌ ఉగ్రవాదుల ప్రాబల్యం అధికంగా ఉండటంతో శాంతి  చర్చలు జరిపేందుకు వీలుపడలేదు. ఇటీవల మధ్య తూర్పు దేశాల్లో ఐఎస్‌ ఉగ్రవాదుల దాడులు అధికమయ్యాయి. ఈ నేపథ్యంలో సిరియాలో శాంతి స్థాపన కోసం అంతర్జాతీయ శాంతి చర్చలు జరపాలని పలు దేశాలు ఆకాంక్షిస్తున్నాయి. కాగా, ఈనెల 11న వియన్నాలో జరిగే శాంతి చర్చల్లో పాల్గనాల్సిందిగా ఇరాన్‌, సౌదీ అరేబియా దేశాలకు ఆహ్వానం అందింది. శాంతి చర్చల్లో పాల్గనడం ఇరాన్‌, సౌదీ అరేబియా దేశాలకు ఇదే  తొలిసారి కావడం విశేషం.  ఈ సమావేశాలు మూడు రోజుల పాటు జరుగనున్నాయి. దీనికి సంబంధించిన అజెండాను  అమెరికా, ఐరాస, రష్యా దేశాలు రూపొందించాయి.  ఇదిలా ఉండగా,  సిరియాలో మోహరించిన విదేశీ బలగాలను తక్షణమే  ఉపసంహరించాలని అస్సద్‌ ప్రతిపక్షం డిమాండ్‌ చేస్తోంది. సిరియాను   సమైక్యంగా ఉంచాలనేది తమ ఆకాంక్ష అని పేర్కొంది.


Post a Comment

0 Comments