హైడ్రోజన్‌ బాంబు తయారుచేశాం  • ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ ప్రకటన

        హైడ్రోజన్‌ బాంబును తయారుచేశామని ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ గురువారం ప్రకటించారు. దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకోవటం కోసం ఇది దోహదపడుతుందని ఆయన పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన వార్తను ఉత్తర కొరియా ప్రభుత్వ ఆధీనంలో నడుస్తున్న మీడియా ఏజెన్సీ విడుదల చేసింది.
         రాజధాని ప్యాంగ్యాంగ్‌లో ఆయుధాగారాన్ని  కిమ్‌ జోంగ్‌ ఉన్‌ గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పైప్రకటన చేశారని ఉత్తర కొరియా కేంద్ర న్యూస్‌ ఏజెన్సీ తెలిపింది. ''శక్తిమంతమైన అణ్వస్త్రదేశంగా రూపొందంటంలో సఫలీకృతమయ్యాం. దేశ స్వాతంత్య్రాన్ని, గౌరవాన్ని ఇది మరింత ఇనుమడింపజేస్తుందని భావిస్తున్నాం. దేశ సైనిక రంగాన్ని నిరంతరం అభివృద్ధి చేస్తూవుంటా''మని ఆయన అన్నారు.
        ఉత్తర కొరియా నిజంగానే హైడ్రోజన్‌ బాంబు తయారుచేసిందా ? లేదా హైడ్రోజన్‌ బాంబు తయారు చేయగలిగే సాంకేతిక పరిజ్ఞానాన్ని పొందిందా ? అన్నదానిపై స్పష్టమైన సమాచారం లేదని దక్షిణ కొరియా నిఘా వర్గాలు తెలియజేస్తున్నాయి. కానీ హైడ్రోజన్‌ బాంబు తయారుచేయడానికి అవసరమయ్యే శాస్త్రవేత్తలు ఉత్తర కొరియాలో వున్నారని ద.కొరియా ఇంటెలిజెన్స్‌ అభిప్రాయపడుతోంది. ప్రస్తుతానికైతే ఉత్తర కొరియా వద్ద హైడ్రోజన్‌ బాంబు వుందన్న విషయాన్ని తాము నమ్మటం లేదని దక్షిణ కొరియా జాతీయ నిఘా సేవల సంస్థ ఓ ప్రకటన చేసింది.
        తాము అణ్వస్త్ర దేశంగా అవతరించామని 2005లో ఉత్తర కొరియా ప్రకటించుకుంది. ఆ తర్వాత మూడుమార్లు భూగర్భంలో అణ్వస్త్ర పరీక్షలు జరిపింది. వీటిని రష్యా, చైనా, జపాన్‌, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా దేశాల్లోని 'సిస్మిక్‌ స్టేషన్స్‌' గుర్తించాయి. దీనిపై అంతర్జాతీయ సమాజం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి 2013లో ఉత్తర కొరియాపై తీవ్రమైన ఆంక్షల్ని విధించింది. ఉత్తర కొరియా బ్యాంకింగ్‌, రవాణా, వాణిజ్య వ్యవస్థలపై ఆంక్షల ప్రభావం పడింది.

Post a Comment

0 Comments