అంతర్రాష్ట్ర చైన్‌స్నాచింగ్‌ ముఠా అరెస్ట్‌  • 93 తులాల బంగారం, కారు, నాలుగు బైకులు స్వాధీనం
  • పోలీసు సిబ్బందికి రివార్డులు

                   అంతర్రాష్ట్ర చైన్‌ స్నాచింగ్‌ ముఠాను నల్లగొండ జిల్లా భువనగిరి పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. ఈ మేరకు అడిషనల్‌ ఎస్‌పి గంగారాం, డిఎస్పీ మోహన్‌రెడ్డి విలేకర్ల సమావేశంలో వివరాలు వెల్లడించారు. అనంతపురం జిల్లా పాపానిపల్లి గ్రామానికి చెందిన గంట రామస్వామి, గంట దుర్గ, కర్నూలు జిల్లా కల్లూరుకు చెందిన తోట పద్మ, రంగారెడ్డి జిల్లాకు చెందిన గారడి రమేశ్‌, గారడి జ్యోతి, హయత్‌నగర్‌ మండలానికి చెందిన అక్షింతల గణేశ్‌, అక్షింతల సంధ్య, తూర్పుగోదావరి జిల్లా కాకినాడ మండలం రాయవరం గ్రామానికి చెందిన దత్త సుజిత మొత్తం ఎనిమిది మంది ముఠాగా ఏర్పడ్డారు. కడప, కర్నూలు, తూర్పుగోదావరి, అనంతపురం, హైదరాబాద్‌, రంగారెడ్డి, నల్లగొండ, వరంగల్‌ జిల్లాల్లో అనేక దొంగతనాలు చేశారు. బీబీనగర్‌కు చెందిన దూశెట్టి ధనలక్ష్మి మెడలోని బంగారు గొలుసు లాక్కొని పారిపోతుండగా ఆమె కేకలు వేయడంతో అక్కడే విధులు నిర్వహిస్తున్న ఐడి సిబ్బంది వెంకటేశ్‌ బీబీనగర్‌ ఎస్‌ఐ ప్రణీత్‌కుమార్‌కు సమాచారం అందించారు. ఎస్‌ఐ వెంటనే సిబ్బందిని అప్రమత్తం చేసి తనిఖీలు చేపట్టగా వీరంతా పట్టుబడ్డారు. ధనలక్ష్మి బంగారు గొలుసును వారి నుండి స్వాధీనం చేసుకున్నారు. వీరి వద్ద నుండి కారు, నాలుగు ద్విచక్ర వాహనాలు, 93 తులాల బంగారు ఆభరణాలు కూడా స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ.30.50 లక్షలు ఉంటుంది. 2014 నుండి భువనగిరి చుట్టుపక్కల ప్రాంతాల్లో 15 దొంగతనాలకు పాల్పడినట్టు నిందితులు అంగీకరించారు. దొంగలను చాకచక్యంగా పట్టుకుని సొత్తు రికవరీ చేయడంలో కృషి చేసిన పట్టణ, రూరల్‌ సిఐలు శంకర్‌గౌడ్‌, తిరుపతి, బీబీనగర్‌ ఎస్‌ఐ ప్రణీత్‌కుమార్‌, హెడ్‌కానిస్టేబుల్‌ ఇంద్రారెడ్డి, కానిస్టేబుల్‌ నర్సింహారెడ్డి, సత్యనారాయణ, ప్రదీప్‌, చంద్రయ్య, 13 మంది సిబ్బందికి రివార్డులు ఇచ్చి సత్కారం చేయనున్నట్టు ఎఎస్పీ తెలిపారు.


Post a Comment

0 Comments