కట్నం అడిగితే కటీఫ్‌  • ఫేస్‌బుక్‌లో పెండ్లికి 'నో' అన్న కేరళ మహిళ

                 సామాజిక మాధ్యమాల వల్ల లాభనష్టాలేమో కానీ వ్యక్తులు తమ అభిప్రాయాన్ని ప్రపంచానికి చాటుకునేందుకు మాత్రం బాగా పనికి వస్తోంది. పెండ్లి సంబంధాలు మొదలుకుని కట్నం అడిగే వరుడిని కాదనే దాకా ఏ నిర్ణయానికైనా ఫేస్‌బుక్‌ ఒక వేదికగా విస్తరిస్తున్నది. తాజాగా, కేరళ రాష్ట్రానికి చెందిన రమ్య రామచంద్రన్‌ అనే యువతి వరుడి గొంతెమ్మ కోర్కెలను వ్యతిరేకిస్తూ ధైర్యంగా పెండ్లికి కటీఫ్‌ చెప్పేసింది. మామూలుగా కాదు, ఫేస్‌బుక్‌లో అందరికీ తెలిసేలా! రమ్య ఎంతో ధైర్యం చేసి ఈ నిర్ణయం తీసుకున్నది. వరుడి తల్లిదండ్రులు భారీగా వరకట్నం అడిగారు. దాంతో రమ్య పెండ్లి వద్దనుకుంది. ఈ విషయాన్ని ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ ద్వారా  సహచరులకు వివరించే ప్రయత్నం చేసింది రమ్య. 'నా పెండ్లి గురించి అందరూ అడుగుతున్నారు. అలా అడిగిన వారికోసం ఈ నోట్‌' అంటూ ఆమె ఈ పోస్ట్‌ చేసింది. 'నా నిశ్చితార్థం అయ్యాక నన్ను ఎవరో వెనక్కి లాగుతున్నట్టు ఫీలయ్యాను. ఎందుకంటే, కాబోయే వరుడి కోరికలు అలాంటివి. 50 బంగారు నాణేలు, ఐదు లక్షల కట్నం... నేను కట్నానికి వ్యతిరేకిని. అందుకే నేను దీన్ని సహించలేకపోయాను. డబ్బిచ్చి వరుణ్ని కొనటం మూర్ఖత్వం అనిపించింది. అందుకే పెండ్లికి నో అనేశాను' అని రమ్య పోస్ట్‌ చేసింది. రమ్య తీసుకున్న ఈ నిర్ణయాన్ని సోషల్‌ మీడియాలో అందరూ మెచ్చుకుంటున్నారు. అయితే తాను కేవలం తన స్నేహితులకు మాత్రమే ఈ విషయం చెప్పాలనుకున్నాను కానీ తన పెండ్లి విషయం అందరినీ ఇంతగా ప్రభావితం చేస్తుందనుకోలేదని రమ్య అంటోంది.


Post a Comment

0 Comments