సిరియా శరణార్థుల పిల్లలకు విద్య అందాలి  • యుద్ధం అంతమొందించేందుకు కృషి చేయాలి : మలాలా, ముజూన్‌ ల పిలుపు

సిరియా శరణార్ధుల పిల్లలకు విద్యనందించడానికి కలిసి కృషి చేయాలని, సంయుక్తంగా ప్రచారం చేపట్టాలని నోబెల్‌ బహుమతి గ్రహీత మలాలా యూసుఫ్‌జాయ్‌, సిరియా విద్యార్ధిని ముజూన్‌ అల్‌మెల్లన్‌ నిర్ణయించారు. భావి తరాల వారి మౌలిక హక్కైన విద్యను కోల్పోవడానికి వీల్లేదని వారు స్పష్టం చేశారు. దాదాపు రెండేళ్ళ క్రితం జోర్డాన్‌లోని ఒక శరణార్ధి శిబిరంలో కలు సుకున్న తర్వాత మలాలా ఇప్పుడు సిరియా స్కూల్‌ విద్యార్ధిని ముజూన్‌ను ఇంగ్లండ్‌లోని తన ఇంటికి రావాల్సిందిగా ఆహ్వానించింది. రాయిటర్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మలాలా మాట్లాడారు. పాకిస్థాన్‌లో తాలిబన్ల దాడిలో గాయపడి చికిత్స నిమిత్తం బర్మింగ్‌హాం చేరుకున్న మలాలా ప్రస్తుతం ఇక్కడే నివసిస్తున్నారు. కాగా మధ్య ప్రాచ్యంలోని శరణార్ధి శిబిరాల నుండి బ్రిటన్‌కు వచ్చిన మొట్టమొదటి బ్యాచ్‌లో ముజూన్‌ వున్నారు. వారిద్దరు మొదట కలుసుకున్నప్పటి నుండి ఇప్పటికి సిరియా శరణార్ధుల సంఖ్య దాదాపు రెట్టింపు అయింది. అంటే 44 లక్షలకు చేరుకుందని ఐక్యరాజ్య సమితి శరణార్ధుల హై కమిషనర్‌ కార్యాలయం (యుఎన్‌హెచ్‌సిఆర్‌) తెలిపింది. సిరియా యుద్ధం ఈ కొత్త సంవత్సరంలోనైనా ముగుస్తుందని ఆశిస్తున్నట్లు మలాలా తెలిపారు. దానికోసం ప్రపంచ నేతలు కూడా కృషి చేయాలని కోరారు.

   


Post a Comment

0 Comments