సెట్‌టాప్‌ బాక్సుల గడువు పెంపు  • 2 నెలలు పొడిగించిన హైకోర్టు

 సెట్‌టాప్‌ బాక్స్‌ ఇంత వరకు అమర్చుకోని వారికి శుభవార్త. బాక్సులను అమర్చుకునేందుకు మరో రెండు నెలలు గడువు పొడిగిస్తూ ఉమ్మడి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. టీవీ డిజిటలైజేషన్‌ గడువును పొడిగించాలని ఫెడరేషన్‌ ఆఫ్‌ తెలంగాణ ఎంఎస్‌ఓస్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయమూర్తి జస్టిస్‌ విలాస్‌ వీ అఫ్జల్‌ పుర్కర్‌ విచారించి ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. టీవీలకు సెట్‌టాప్‌ బాక్సులను అమర్చుకునే గడువు ఈ నెల 31 న ముగుస్తోందని, అయితే, అందుకు సంబంధించిన బాక్సులను సరఫరా చేయడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని, అందువల్ల గడువును పొడిగించాలని ఎంఎస్‌ఓల సంఘం తరపు న్యాయవాది రామచంద్రరాజు ఈ సందర్భంగా వాదనలు వినిపించారు. ఏపీ, తెలంగాణలో దాదాపు 45 లక్షల నుంచి 50 లక్షల వరకు సెట్‌టాప్‌ బాక్సులు అమర్చాల్సి ఉందనీ, బాక్సులు లేనందున అమర్చుకోలేకపోయారని నివేదించారు. వాదనలు విన్న న్యాయమూర్తి గడువు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కేబుల్‌ టీవీ డిజిటలైజేషన్‌ మూడో దశలో భాగంగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని 115 పట్టణాలు, నగరాల్లో సెట్‌టాప్‌ బాక్సులు అమర్చుకోవాల్సి ఉంది. లేకపోతే అనలాగ్‌ ప్రసారాలు నిలిపివేయాల్సి ఉంటుంది. బాక్సుల సరఫరా జరగనందున లక్షల సంఖ్యలో వినియోగదారులు అమర్చుకోలేకపోయారు.


Post a Comment

0 Comments