ఢిల్లీలో కుప్పకూలిన బీఎస్‌ఎఫ్‌ విమానం  • టేకాఫ్‌ అయిన  కొన్ని నిమిషాల్లోనే ప్రమాదం
  • ఇద్దరు పైలట్లతో సహా 10 మంది దుర్మరణం

ఢిల్లీ సమీపంలో విమానం కూలి అందులో ప్రయాణిస్తున్న మొత్తం పదిమంది బీఎస్‌ఎఫ్‌ సిబ్బంది దుర్మరణం పాలయ్యారు. మంగళవారం ఉదయం ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి టేకాఫ్‌ అయిన కొన్ని నిమిషాల్లోనే సూపర్‌కింగ్‌ విమానం ద్వారక ప్రాంతంలో గోడను ఢీకొని కూలిపోయింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు పైలట్లు సహా 10 మంది బీఎస్‌ఎఫ్‌ సిబ్బంది అక్కడికక్కడే మృతి చెందారు.వివరాలు ఇలా ఉన్నాయి.. రెండు ఇంజన్లు కలిగిన విమానం  బీఎస్‌ఎఫ్‌ సిబ్బందిని ఢిల్లీ నుంచి రాంచీ తీసుకెళ్తుండగా సాంకేతిక సమస్య తలెత్తటంతో పైలట్‌ కంట్రోల్‌ రూమ్‌కు సమాచారమిచ్చారు. అత్యవసరంగా దించటానికి అనుమతించగా...ఆ సిగ్నల్‌ అందుకునేలోపు ప్రమాదం సంభవించింది. సంఘటన జరిగిన చోట విమాన శకలాలు తగిలి అక్కడ పని చేస్తున్న ఇద్దరు కూలీలు తీవ్రంగా గాయపడటంతో వారిని ఆస్పత్రికి తరలించారు. ప్రమాద స్థలానికి 15 అగ్నిమాపక వాహనాలను తరలించి చుట్టుపక్కల మంటలు వ్యాపించకుండా అదుపు చేశారు.
మృతుల కుటుంబాలకు రూ. 20 లక్షల చొప్పున పరిహారం 
ద్వారక ప్రాంతంలోని ప్రమాద స్థలాన్ని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ సందర్శించారు. బీఎస్‌ఎఫ్‌ సిబ్బంది మృతికి ప్రధాని నరేంద్రమోడీ సంతాపం తెలిపారు. ప్రమాద ఘటనపై విచారణకు ఆదేశించినట్టు పౌర విమానయానశాఖ సహాయ మంత్రి మహేశ్‌శర్మ తెలిపారు. మృతి చెందిన బిఎస్‌ఎఫ్‌ సిబ్బంది కుటుంబాలకు ఒక్కొక్కరికీ రూ.20 లక్షల చొప్పున పరిహారాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
బీఎస్‌ఎఫ్‌ అధికారులిచ్చిన సమాచారం మేరకు ఈ విమానాన్ని 1982 నుంచి బీఎస్‌ఎఫ్‌లో వినియోగించటం మోదలుపెట్టారు. ఇందులో ఓ క్రూ మెంబర్‌తో సహ 11 మంది ప్రయాణించవచ్చు. కాగా, రాంచీలోని ఓ హెలికాప్టర్‌కు మరమ్మతులు చేయటానికి 30 ఏండ్లు నిండిన సూపర్‌కింగ్‌ చార్టర్‌ విమానంలో బీఎస్‌ఎఫ్‌ సిబ్బంది నిపుణులను వెంటపెట్టుకొని బయలుదేరింది. ఆ హెలికాప్టర్‌లో ఈనెల 27న ప్రధానిమోడీ, జనవరి10న రాష్ట్రపతి ప్రణబ్‌ ప్రయాణించాల్సిఉంది. అందుకు సిద్ధం చేయటానికి   బీఎస్‌ఎఫ్‌ సిబ్బందితో బయలుదేరిన విమానం ప్రమాదవశాత్తూ కూలిపోయింది. ఈ దుర్ఘటన కారణంగా మంగళవారం ఢాకాలో జరగాల్సిన భారత్‌-బంగ్లాదేశ్‌ దేశాల డీజీ స్థాయి అధికారుల సమావేశం రద్దయింది.Post a Comment

0 Comments