ఇంటి దగ్గర వదిలేస్తానికి తీసుకెళ్లి...  • మహారాష్ట్రలో విద్యార్థిపై అత్యాచారం... ఇద్దరి అరెస్ట్‌

పాఠశాలలో ఆడుకుంటూ విద్యార్థినికి గాయమైంది. ఆమెను ఇంటి దగ్గర దింపేసి రావాల్సిందిగా స్కూలు వంటవాడు సహా మరొకరికి పాఠశాల హెడ్మాస్టర్‌ పాపను అప్పగించారు. అమెను ఇంటి వద్ద దించాల్సిన ఆ దుర్మార్గులు దారిలో చిన్నారిపై లైంగిక దాడికి ఒడిగట్టారు... మహారాష్ట్రలోని గచ్చిరోలిలో జరిగిన ఈ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గచ్చిరోలి జిల్లా దోడ్రాజ్‌ గ్రామంలో ఓ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న బాలికపై పాఠశాలలో వంటవాడిగా పనిచేస్తున్న బత్రుగడ్‌ బండు (30), అతని స్నేహితుడు ప్రశాంత్‌ పిల్లరె (32) సామూహిక లైంగిక దాడికి పాల్పడినట్టు పోలీసు సబ్‌ డివిజనల్‌ అధికారి సందీప్‌ గావిట్‌ చెప్పారు. గాయమైన బాలికను మోటరు సైకిల్‌పై ఇంటి వద్ద దింపేందుకు బయలుదేరిన వీరు మార్గమధ్యలో నిర్మానుష్య ప్రాంతంలో ఆమెపై అత్యాచారం చేశారని అన్నారు. నేరానికి పాల్పడిన అనంతరం వారు ఆమెను గ్రామంలో వదిలేసి పరారయ్యారు. ఈ ఘటన మంగళవారం జరగగా, బాలిక ఆరోగ్యం విషమించడంతో విషయం తెలుసుకున్న బాలిక కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వారిపై కేసు నమోదు చేసిన పోలీసులు గురువారం నిందితులిద్దరినీ అరెస్టుచేశారు. స్థానిక కోర్టులో ప్రవేశపెట్టగా వీరికి ఈ నెల 22 వరకూ కోర్టు పోలీసు కస్టడీ విధించింది. ప్రస్తుతం బాలిక ఆస్పత్రిలో చికిత్స పొందుతోందని పోలీసులు తెలిపారు.


Post a Comment

0 Comments