ముంబయి జంట హత్య కేసులో ఒకరి అరెస్టు


               సంచలనం సృష్టించిన హేమా ఉపాధ్యాయ్‌, హర్ష్‌ భాంభానీ జంట హత్య కేసులో ఉత్తరప్రదేశ్‌ పోలీసులు ఒక వ్యక్తిని అరెస్టు చేశారు. ప్రఖ్యాత చిత్రకారిణి హేమ, ఆమె తరఫు న్యాయవాది హర్ష్‌ల మృతదేహాలు శుక్రవారం ముంబయి సబర్బన్‌ ప్రాంతం కాందీవలీలోని ఒక మురికికాల్వలో లభ్యమైన విషయం తెలిసిందే. శనివారం నాడు వీరి శవాలను గుర్తించారు. రెండు అట్టపెట్టెలలో లభ్యమైన హేమ, వర్ష్‌ల మృతదేహాలు కాళ్లు, చేతులు కట్టేసి వున్నాయని పోలీసులు తెలిపారు. 43 సంవత్సరాల హేమ, ఆమె మాజీ భర్త చింతన్‌ ఉపాధ్యాయ్‌ ఇద్దరికీ విడాకులైనప్పటికీ ఒకే ఫ్లాట్‌లో ఉంటున్నారు. చింతన్‌ కూడా కళాకారుడే. ముంబయి పోలీసులు ఈ కేసు విషయంలో చింతన్‌ను విచారించారు. అయితే రియల్‌ ఎస్టేట్‌ ఆస్తుల వివాదాలే ఈ హత్యకు కారణం అయి ఉండొచ్చని భావిస్తున్నారు. హేమ తన న్యాయవాది హర్ష్‌ భాంభానీతో కలిసి శుక్రవారం ముంబయిలోని జుహూ ప్రాంతానికి వెళ్లారని తెలిసింది. కాగా, ఈ కేసుతో సంబంధం ఉన్న ఇద్దరిని వారణాసిలో అదుపులోకి తీసుకున్నట్టు ఉత్తరప్రదేశ్‌ ఎస్‌ఎస్‌పీ అమిత్‌ పాఠక్‌ ధృవీకరించారు. వీరిలో ఒకరిని అరెస్టు చేశామని, అతణ్ని కోర్టు ముందు ప్రవేశపెడతామని ఆయన చెప్పారు. ఈ హత్యలో ఐదుగురు పాల్గని ఉంటారని ఆయన అన్నారు.


Post a Comment

0 Comments