నవ శకానికి నాంది!

            
             టెస్టు కెప్టెన్‌గా విరాట్‌ కోహ్లి భారత్‌ క్రికెట్‌లో కొత్త శకానికి తెరతీశాడు. సారథిగా కోహ్లి వరుసగా రెండో సిరీస్‌ అందుకున్నాడు. ముందు నుంచీ దూకుడుగా వెళ్తోన్న కోహ్లి.. ఆసీస్‌ పర్యటనలో, శ్రీలంక టూర్‌ ఆరంభంలో ప్రతికూల ఫలితం చవిచూశాడు. ఓటమి ఎదురైందని కుంగని కోహ్లి.. వైఖరిని మార్చుకోలేదు. లంకపై వరుస విజయాలు.. సొంతగడ్డపై వరల్డ్‌ నెం.1 దక్షిణాఫ్రికాపై 3ా0తో సిరీస్‌ విజయం కోహ్లి సారథ్య సామర్థ్యానికి నిదర్శనం. నా ఒక్కడితో ఒరిగేందేమీ లేదని కోహ్లి క్రెడిట్‌ను జట్టుకు బదలాయించినా.. సఫారీ సిరీస్‌లో అతడి కెప్టెన్సీ నైపుణ్యం తీసిపారేయలేనిది. ముందు నుంచీ ఐదుగురు బౌలర్ల ఫార్ములాను విశ్వసించిన కోహ్లి.. ఈ సిరీస్‌లో పిచ్‌ స్వభావాన్ని బట్టి తుది జట్టు కూర్పు ఉండేలా చూసుకున్నాడు. కోట్లలో పేసర్‌ ఉమేశ్‌ యాదవ్‌ను ఆడించటం ఇదే కోవలోకి వస్తోంది. కీలక ఆటగాళ్ల వికెట్ల తీసి విజయంలో ప్రముఖ పాత్ర పోషించిన అమిత్‌ మిశ్రాను స్పిన్‌ ట్రాక్‌పై బెంచ్‌పై కూర్చోబెట్టడం ఆశ్చర్యపరిచే నిర్ణయమే. కానీ పిచ్‌ విమర్శలను తిప్పికొట్టేలా.. సిరీస్‌ విజయాన్ని మనసారా ఆస్వాదించేలా చేసింది ఉమేశ్‌ యాదవ్‌ ఆఖరి స్పెల్‌ అని చెప్పక తప్పదు. జహీర్‌ఖాన్‌ తర్వాత భారత జట్టులో రివర్స్‌ స్వింగ్‌ ఇంతలా రాబట్టిన ఏకైక పేసర్‌ ఉమేశ్‌. హాఫ్‌ కట్టర్‌తో విలాస్‌.. రివర్స్‌ స్వింగ్‌తో అబాట్‌..పేస్‌తో పీట్‌ను పెవిలియన్‌కు చేర్చిన ఉమేశ్‌ యాదవ్‌ మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. ఏదేని ఆటగాడు ఫామ్‌లో లేకపోతే అతడికి ఆత్మవిశ్వాసం ఇవ్వాల్సిన బాధ్యత కెప్టెన్‌పై ఉంటుంది. ఉమేశ్‌ విషయంలో కోహ్లి ఇదే పని చేశాడు. అద్భుత ఫలితాన్ని రాబట్టాడు. 
ముందుండి నడిపించే వాడే నాయకుడు. సిరీస్‌లో ఆరంభ మ్యాచ్‌ల్లో విఫలమైనా క్రీజులో కోహ్లి ఎంతో సౌకర్యవంతంగా కనిపించాడు. సొంతమైదానంలో కెప్టెన్‌గా తొలి టెస్టులో శతకం తృటిలో చేజారినా.. కోహ్లి ఇన్నింగ్స్‌ రహానే కుదురుకోవడానికి పనికొచ్చింది. ఇన్నింగ్స్‌ డిక్లేర్‌ చేసి సఫారీ బ్యాటింగ్‌ ఆహ్వానించాల్సిన తరుణంలో దూకుడుగా ఆడిన కోహ్లి.. రహానే మరింత స్వేచ్ఛగా ఆడేందుకు వీలు కల్పించాడు. బౌలర్లు రాజ్యమేలిన ఈ సిరీస్‌లో బ్యాట్స్‌మెన్‌ ప్రస్తావన లేవనెత్తకపోవటమే మంచిది. పునరాగమనం కష్టమనుకున్న తరుణంలో జడేజాను జట్టులోకి తీసుకున్న కోహ్లి.. జట్టు అవసరాలను ముందే గుర్తించాడు. స్పిన్‌ ట్రాక్‌లపై సఫారీలను ఇబ్బందిపెట్టగల జడేజాను ఎన్నుకుని అనుకున్న ఫలితం రాబట్టాడు. తొలి మూడు మ్యాచ్‌ల్లో వికెట్ల కోసం పెద్దగా శ్రమపడకపోయినా.. కోట్లలో గట్టిగానే ప్రయత్నించారు. సెషన్ల కొద్దీ వికెట్ల కోసం ఎదురుచూస్తున్న తరుణంలో సహచరుల్లో ముఖ్యంగా బౌలర్లలో నిస్సహాతను ఎక్కడా దరిచేరనీయలేదు కోహ్లి. సుదీర్ఘంగా వికెట్‌ కోసం వేచిచూస్తున్న తరుణంలో జట్టును కసితో ఉండేలా చూడగలిగాడు. ఏ సమయంలోనూ స్థైర్యం కోల్పోకుండా విజయం కోసమే ఆడేలా చేశాడు.
జట్టు కూర్పు, పిచ్‌ దగ్గరి నుంచి అన్నింట్లోనూ దూకుడుగా వెళ్తోన్న కోహ్లి.. తను ముందు చెప్పినట్టు ఎప్పుడూ గెలుపు కోసమే ఆడుతున్నాడు.. జట్టును అదే బాట పట్టించాడు. చావో రేవో దృక్పథాన్ని జట్టుకు అలవర్చిన కోహ్లి.. సౌరవ్‌ గంగూలీ తర్వాత అత్యంత దూకుడైన సారథిగా పేరొందాడు. గెలుపు లేదా ఓటమి.. డ్రా కోసం ఆడేది లేదంటున్న కోహ్లి భారత క్రికెట్‌ను మరో మెట్టు ఎక్కించేందుకు నవ (తన) శకానికి నాంది పలికాడని చెప్పవచ్చు!


Post a Comment

0 Comments