నన్ను గుడిలోకి వెళ్లనివ్వలేదు...  •   కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ

         స్సాంలో తనను ఒక మందిరంలోకి వెళ్లకుండా ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్తలు అడ్డుకున్నారని కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ఆరోపించారు. ఇందుకోసం ఆర్‌ఎస్‌ఎస్‌ వాళ్లు మహిళలను అడ్డుపెట్టుకొన్నారని ఆయన అన్నారు. అయితే వారు అక్కడి నుంచి వెళ్లిపోయిన తర్వాత సాయంత్రం తాను ఆ మందిరంలోకి ఎటువంటి ఇబ్బంది లేకుండా వెళ్లానని ఆయన చెప్పారు. కేరళ, పంజాబ్‌, అస్సాంలలో జరిగిన వేర్వేరు సంఘటనలపై సోమవారం ఉదయం కాంగ్రెస్‌ పార్టీ పార్లమెంటు వెలుపల నిరసన ప్రదర్శన నిర్వహించింది. కేరళ ముఖ్యమంత్రి ఓమన్‌ చాండీని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాల్గన్న ఒక కార్యక్రమానికి వెళ్లకుండా అడ్డుకున్నారని రాహుల్‌ గాంధీ ఆరోపించారు. చాండీ కేరళ ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు కాబట్టి ఇది కేరళ ప్రజలందరికీ అవమానం అనీ, దీనిని సహించేది లేదనీ ఆయన అన్నారు. పంజాబ్‌లో అమాయక ప్రజలను హత్య చేస్తున్నారని, దళితులను చంపుతున్నారని రాహుల్‌ ఆరోపించారు. ఈ సంఘటనలన్నింటినీ జోడిస్తూ, ఇవన్నీ నరేంద్ర మోడీ భావజాలం ఫలితమేనని ఆయన అన్నారు. 'ఇదే ఆయన పని విధానం. ఒక కాంగ్రెస్‌ ముఖ్యమంత్రిని అడ్డుకోవడం, నన్ను గుడిలోకి వెళ్లనివ్వకపోవడం, దళితులను చంపెయ్యడం. దీనిని దేశ ప్రజలెవ్వరూ ఆమోదించరు. ప్రభుత్వం తన పని పద్ధతులను మార్చుకోవాలి' అని రాహుల్‌ డిమాండ్‌ చేశారు.


Post a Comment

0 Comments