ఇస్లాంలోకి మారిన దళిత ఐఏఎస్‌ అధికారి  • కుల వివక్షతోనే ప్రమోషన్‌ ఇవ్వలేదంటూ స్వచ్ఛంద పదవీవిరమణ

 రాజస్థాన్‌ కేడర్‌కు చెందిన సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి ఉమ్రావ్‌ సలోదియా ఇస్లాం మతాన్ని స్వీకరించారు. కులవివక్షతోనే ప్రభుత్వం తనకు ప్రధాన కార్యదర్శి (సీఎస్‌)గా ప్రమోషన్‌ ఇవ్వలేదని ఆరోపిస్తూ సలోదియా స్వచ్ఛంద పదవీ విరమణకు దరఖాస్తు చేసుకున్నారు. దళిత సముదాయానికి చెందిన సలోదియా ప్రస్తుతం ఆర్‌ఎస్‌ఆర్‌టీసీ చైర్మన్‌గా, అదనపు ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. తనకు ప్రధాన కార్యదర్శిగా ప్రమోషన్‌ ఇవ్వకుండా ప్రస్తుత సీఎస్‌కే 3 నెలల పొడిగింపు ఇవ్వడంపై ఆయన తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఒక జూనియర్‌ కింద పని చేయలేనంటూ, ప్రభుత్వ తీరుకు నిరసనగా ఆయన పదవీ విరమణ చేయాలని నిర్ణయించుకున్నట్టు ఆయన తెలిపారు. 'షెడ్యూల్డు కులానికి చెందిన వాడిని, సీనియర్‌ ఐఏఎస్‌ అధికారిని కాబట్టి ప్రధాన కార్యదర్శిగా నాకు అవకాశం లభిస్తుందని ఆశించాను. నేను కులవివక్షకు గురయ్యానని భావిస్తున్నాను' అని సలోదియా ఆరోపించారు. ఆయన 2016 జూన్‌లో రిటైర్‌ కావాల్సి ఉంది. ఉమ్రావ్‌ సలోదియా ఇప్పుడు 'ఉమ్రావ్‌ ఖాన్‌'గా మారిపోయారు. సమానత్వాన్ని బోధించిన ఇస్లాం తనకు నచ్చిందని ఆయన తెలిపారు. అయితే, సలోదియా ఆరోపణలను రాజస్థాన్‌ ప్రభుత్వం తోసిపుచ్చింది. అంతేకాదు, ప్రభుత్వ అధికారిగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసినందుకు ఆయనపై చర్య తీసుకుంటామని కూడా తెలిపింది. రాజస్థాన్‌ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీల పట్ల ఎలాంటి వివక్ష చూపడం లేదని, ప్రస్తుతం అసెంబ్లీలో స్పీకర్‌గా ఉన్న కైలాష్‌ మేఘ్వాల్‌, ఆర్‌పీఎస్‌సీ చైర్మన్‌గా ఉన్న లలిత్‌ కే పన్వార్‌ వంటి వారు ఎస్సీ/ఎస్టీ సముదాయాలకు చెందినవారేనని మంత్రి రాజేంద్ర రాథోడ్‌ తెలిపారు.


Post a Comment

0 Comments