పాస్‌పోర్టుల జారీలో భారత్‌ది మూడో స్థానం


పాస్‌పోర్టులను జారీ చేయడంలో చైనా, అమెరికాల తర్వాత భారత్‌ మూడో స్థానంలో ఉందని విదేశాంగశాఖ అధికారి ఒకరు చెప్పారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మన దేశం 1 కోటి 20 లక్షల మందికి పాస్‌పోర్టులు జారీ చేసింది. 1 కోటి 60 లక్షలతో చైనా మొదటి స్థానంలో, 1 కోటి 40 లక్షలతో అమెరికా రెండో స్థానంలో ఉన్నాయి. మునుపటి ఆర్థిక సంవత్సరం (2014ా15)లో భారత్‌ కోటి మందికి పాస్‌పోర్టులు అందించిందని, ఐదేళ్ల క్రితం ఈ సంఖ్య 16 లక్షలేనని విదేశాంగశాఖ సంయుక్త కార్యదర్శి ముక్తేశ్‌కుమార్‌ పర్దేశీ తెలిపారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఈ సంఖ్యలో 20 శాతం వృద్ధి సాధించాలనే లక్ష్యం తమకుందని ఆయన చెప్పారు. అగర్తలాలో పాస్‌పోర్టు సేవా కేంద్రం (పీఎస్‌కే) ప్రారంభోత్సవం సందర్భంగా ఆయన ప్రసంగించారు. త్రిపుర మంత్రి భానులాల్‌ సాహా ఈ కేంద్రాన్ని ప్రారంభించారు. పాస్‌పోర్టులను జారీ చేయడం ద్వారా ఈ సంవత్సరం రూ. 2400 కోట్లు ఆదాయం వచ్చిందని ఆయన తెలిపారు. భారత్‌లో ప్రస్తుతం 6 కోట్ల 50 లక్షల మందికి పాస్‌పోర్టులున్నాయని ఆయన చెప్పారు. విదేశాలలో సైతం 183 దౌత్య కార్యాలయాల ద్వారా పాస్‌పోర్టులను జారీ చేస్తున్నామని అధికారి వెల్లడి చేశారు. 'కావాలనుకునే భారతీయులందరికీ పాస్‌పోర్టులు జారీ చేయాలనేది భారత ప్రభుత్వ అభిమతం. డిజిటల్‌ ప్రాసెసింగ్‌ ద్వారా ఈాగవర్నెన్స్‌ పద్ధతిలో వీటిని జారీ చేస్తున్నాం' అని పర్దేశీ వివరించారు. పాస్‌పోర్టుల జారీలో జాప్యం జరగడానికి పోలీసు తనిఖీ ఒక ముఖ్య సమస్యగా ఉందని ఆయన చెప్పారు. జనవరిలో అరుణాచల్‌ప్రదేశ్‌, నాగాలాండ్‌లలో కూడా పీఎస్‌కేలను ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు.


Post a Comment

0 Comments