జనం జేబుల్లో 'నకిలీ' నోట్లు!
  • ఆర్‌బీఐ తప్పిదం ఫలితంగా చెలామణిలో రూ. 10 కోట్లు

సాధారణంగా నకిలీ నోట్లు విదేశాలనుంచి దిగుమతిఅవుతుంటాయి. కానీ భారత రిజర్వ్‌ బ్యాంక్‌ నుంచే అలాంటి కరెన్సీ మార్కెట్లో చేతులు మారుతోందంటే నమ్ముతారా! ఇది నిజం. రూ. 30 కోట్లు విలువ చేసే వెయ్యి రూపాయల నోట్ల ముద్రణలో తప్పులు దొర్లాయి. అయితే తప్పిదాన్ని గ్రహించడంతో వీటిలో రూ. 20 కోట్ల నోట్లు రిజర్వ్‌ బ్యాంకు వద్దనే ఆపేశారు. కానీ రూ. 10 కోట్ల నోట్లు జనం జేబుల్లోకి చేరిపోయాయి. ఈ నకిలీ నోట్లను గుర్తించడం కూడా చాలా కష్టం
ఏయే సీరిస్‌ నోట్లలో తప్పులు దొర్లాయి? ఎన్ని నోట్లు బ్యాంకులో తిరిగి జమ అయ్యాయి?
ఆర్‌బీఐ ఇచ్చిన వివరాల ప్రకారం 5ఏజీ, 3ఏపీ సీరిస్‌ వెయ్యి రూపాయల నోట్లు సిల్వర్‌ సెక్యూరిటీ దారం లేకుండానే ముద్రించారు. ఈ నోట్ల తయారీకి వినియోగించిన కాగితం హోషంగాబాద్‌ లోని సెక్యూరిటీ ప్రింటింగ్‌, మింటింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌  నుంచి వచ్చింది. అక్కడ నుంచి నాసిక్‌లోని ఆర్‌బీఐ ప్రెస్‌కు చేరింది.ఈ ప్రక్రియ జరిగేటప్పుడే తప్పిదం చోటు చేసుకుంది. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందాన అధికారులు ఆలస్యంగా మేల్కని నకిలీ నోట్లను తిరిగి జమ చేయటం మొదలుపెట్టారు. ప్రస్తుతం రిజర్వ్‌ బ్యాంకు వద్ద రూ. 6 కోట్ల విలువైన నోట్లు మాత్రమే జమ అయ్యాయి. అలా సేకరించిన నోట్లను తగలబెట్టెందుకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ అనుమతి కోరాలని బ్యాంకు నిర్ణయించింది.
అలాంటి నోట్లు మీ దగ్గరున్నాయేమో పరిశీలించుకోండి!
మీ దగ్గర వెయ్యి రూపాయల నోట్లు ఉంటే, వాటిపై 5ఏజీ, 3ఏపీ సిరీస్‌ ఉందేమో చూసుకోండి. నోటును లైట్‌ కింద పెట్టి పరిశీలించండి. దానిపై మొదటి డిజిట్‌ కింద 'ఎల్‌' అక్షరం కనిపిస్తుంది. ఆ నోటు ముందు భాగాన్ని చూడాలి. అందులో సిల్వర్‌ సెక్యూరిటీ దారం ఉంటుంది.ఒకవేళ ఆ మూడు అంశాల్లోనూ భిన్నంగా ఉన్న నోట్లు మీ దగ్గరుంటే, అవి 'నకిలీ'  నోట్లే. అలాంటి నోట్లను జారీ చేయవద్దని బ్యాంకులకు ఆదేశిస్తూ 2015 డిసెంబర్‌ 14 న ఆర్‌బీఐ ఒక లేఖ రాసింది. ఖాతాదారులు అలాంటి నోట్లను తీసుకుని బ్యాంకులకు వచ్చినా పూర్తి మార్పిడి  విలువను ఇవ్వాలని ఆర్‌బీఐ సూచించింది.
ఇది ఎలా బయటకొచ్చింది?
నోట్లు ముద్రించే కాగితం మధ్యప్రదేశ్‌లోని హోషంగాబాద్‌ నుంచి సెక్యూరిటీ పేపర్‌ మిల్లులో తయారవుతుంది. గతేడాది ఇక్కడ జర్మన్‌ ఆటోమెటిక్‌ మిషన్‌ పీఎం5 కాగితంతో ఈ నోట్లను తయారుచేశారు. ఇక్కడ తయారయ్యే కాగితం నాణ్యత బాగుంటుంది. ఈ మిషన్‌పై 1200 మంది ఉద్యోగుల పని కేవలం 200 మందితోనే సరిపెడుతున్నారు. ఇక్కడే వెయ్యి రూపాయల నోటుకు సిల్వర్‌ సెక్యూరిటీ దారం పెడతారు. ఇలా దారంపెట్టే రెండు మిషన్లు నాసిక్‌లోనూ ఉన్నాయి. అయితే నోట్ల తయారీ ప్రక్రియలో మొదటి అర్ధభాగం జరిగే హోషంగాబాద్‌లోనే తప్పిదం చోటుచేసుకున్నది. తేరుకుని విచారణ జరిపించి పీఎం5 మిషన్‌ను ఓ వారం పాటు మూసేశారు. అక్కడ బాధ్యతలు నిర్వహించే మేనేజర్‌ను సస్పెండ్‌ చేశారు. కానీ అప్పటికే రూ. 30 కోట్ల విలువైన వెయ్యి రూపాయల నోట్ల ముద్రణ జరిగిపోయింది
ఆర్‌బీఐ చేపట్టిన చర్యలేమిటి?
ఆర్‌బీఐ ముద్రణలో జరిగిన లోపాలను గుర్తించి పానిపట్‌ లో ఫిర్యాదు చేశారు. నిర్లక్ష్యం కారణంగా నాసిక్‌ ప్రెస్‌లోని ముగ్గురు ఉద్యోగులను ఇటీవల సస్పెండ్‌ చేశారు. వారికి నోటీసులు జారీచేశారు.
జరిగిన తప్పును సరిదిద్దుకునే పనులు చేపట్టారు ఆర్‌బీఐ అధికారులు. దీని కోసం ఓ కమిటీని నియమించారు.ఈ కమిటీ హోషంగాబాద్‌ పేపర్‌ మిల్లు, నాసిక్‌లోని కరెన్సీ నోటు తయారీ ప్రెస్‌పై విచారణ జరపనున్నది.
సెక్యూరిటీ ఫీచర్స్‌తో వెయ్యి నోట్ల ముద్రణ
వెయ్యి రూపాయల కరెన్సీ నోటుపై మహాత్మగాంధీ వాటర్‌ మార్క్‌ బమ్మ , ఆ నోటు విలువ ఉంటాయి.ఈ కరెన్సీని వెలుగులో చూస్తే వెయ్యి రూపాయల ప్రింట్‌ ఫ్లోరర్‌ డిజైన్‌లో ఇరువైపులా కనిపిస్తోంది. నోటుపై డైమండ్‌ షేప్‌ సింబల్‌ ప్రత్యేకం.
నోటు తయారీ ఎలా జరుగుతుంది?
కాటన్‌, వేడినీళ్లు, కెమికల్‌ను ఎక్కువ ఉష్ణోగ్రతతో మిక్స్‌ చేసి గుజ్జు (పల్ప్‌) తయారుచేస్తారు. ఆ పల్ప్‌ను పేపర్‌ తయారీ మిషన్‌లో వేస్తారు. అక్కడే సెక్యూరిటీ దారం కూడా అమర్చుతారు. ఈ ప్రక్రియ జరిగేటప్పుడు సెక్యూరిటీ దారం తెగే అవకాశముంది. పల్ప్‌ ,పేపర్‌, నీరు తొలగించాక వాటిని ఆరబెట్టాల్సి ఉంటుంది. అనంతరం ప్రెస్‌ చేయటానికి, క్యాలెండరింగ్‌ కోసం పంపిస్తారు. ఆ తర్వాత కరెన్సీ పేపర్‌ను రోల్‌గా చుట్టి షీటర్‌ మిషన్‌పైకి ఎక్కిస్తారు. అలా పేపర్‌నుంచి కరెన్సీ నోట్లను సైజు ప్రకారం కట్‌ చేస్తారు. ప్రింటింగ్‌కు పేపర్‌ తరలించేటప్పుడు అంతిమంగా మరోసారి జర్మన్‌ మిషన్‌పై సెక్యూరిటీ ఫీచర్స్‌ పరిశీలిస్తారు.


Post a Comment

0 Comments