మిథాలీసేన కూడా...  • ఐదు వికెట్ల తేడాతో ఆసీస్‌ మహిళలపై గెలుపు
  • టీ20 సిరీస్‌లో 1ా0 ముందంజ 

ఆడిలైడ్‌ : భారత మహిళల క్రికెట్‌ జట్టు కొత్త ఏడాదిని విజయంతో ఆరంభించింది. 2016 ప్రపంచకప్‌ సన్నాహకంలో భాగంగా ఆసీస్‌తో జరుగుతున్న మూడు మ్యాచుల టీ20 సిరీస్‌లో మిథాలీ రాజ్‌ సారథ్యంలోని మహిళల జట్టు శుభారంభం చేసింది. ఆడిలైడ్‌ ఓవల్‌ వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో ఆసీస్‌పై భారత్‌ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఆసీస్‌ నిర్దేశించిన 141 ఛేదనలో రాణించిన హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ 'ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌'గా నిలిచింది. ఆడిలైడ్‌ విజయంతో టీ20 సిరీస్‌లో భారత్‌ 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.
టాస్‌ నెగ్గి ఆసీస్‌ను తొలుత బ్యాటింగ్‌కు ఆహ్వానించిన మిథాలీరాజ్‌.. బౌలర్లు రాణించటంతో ఆతిథ్య జట్టును 140 పరుగులకే పరిమితం చేశారు. ఆసీస్‌ జట్టులో మూనీ (36), బ్లాక్‌వెల్‌ (27) సహా వికెట్‌ కీపర్‌ హీలే (41) రాణించారు. భారీ ఛేదనలో భారత్‌ ఆరంభంలోనే కెప్టెన్‌ మిథాలీ (4) వికెట్‌  కోల్పోయింది. స్మృతి (29), వేద కృష్ణమార్తి (38)కి తోడు హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (46, 31 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్‌)
విజృంభించటంతో మరో ఎనిమిది బంతులుండగానే భారత్‌ విజయం సాధించింది. ఐతే రికార్డు ఛేదనలో భారత్‌ మిడిల్‌ ఓవర్లలో ఒత్తిడిలో పడింది. వరుసగా మూడు వికెట్లు కూల్చి రేసులోకి వచ్చిన ఆసీస్‌.. భారత్‌ను 14 ఓవర్లలో 91/4తో కష్టాల్లోకి నెట్టారు. ఆఖరి ఆరు ఓవర్లలో 50 పరుగులు చేయాల్సిన దశలో.. నెమ్మదిగా ఆరంభించిన కౌర్‌.. 16 బంతుల వ్యవధిలో ఓ భారీ సిక్స్‌, ఆరు ఫోర్లు బాది జట్టును గెలుపు తీరాలకు చేర్చింది. ఆఖర్లో కౌర్‌ వెనుదిరిగినా.. అంజునా (14), శిఖా (4) జట్టును గెలుపు తీరాలకు చేర్చారు.  ఆడిలైడ్‌లో మిథాలీసేన రికార్డు లక్ష్యాన్ని ఛేదించింది. గతంలో న్యూజిలాండ్‌పై ఛేజింగ్‌ చేసిన 128/7 ఇదివరకు భారత్‌ ఛేదించిన అత్యధిక స్కోరు. ఆడిలైడ్‌లో 141 పరుగుల ఛేదనను విజయవంతంగా ముగించిన మిథాలీసేన.. కొత్త రికార్డును నెలకొల్పింది.
సంక్షిప్త స్కోరు వివరాలు : 
ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌ : 140/5 ( మూనీ 36, హీలే 41, బ్లాక్‌వెల్‌ 27, పూనమ్‌ యాదవ్‌ 2/26)
భారత్‌ ఇన్నింగ్స్‌ : 141/5 (హర్మణ్‌ప్రీత్‌ కౌర్‌ 46, వేద కృష్ణమూర్తి 38, స్మృతీత మందన 29, జెస్‌ 2/24) 


Post a Comment

0 Comments