హత్యల్లో యూపీ.. రేప్‌ కేసుల్లో మధ్యప్రదేశ్‌ టాప్‌..

 హత్యల్లో యూపీ.. రేప్‌ కేసుల్లో మధ్యప్రదేశ్‌ టాప్‌..

     న్యూఢిల్లీ:     ఉత్తరప్రదేశ్‌.. నేరాలకు నిలయంగా మారింది. రాష్ట్రంలో రోజురోజుకూ నేరాలు పెరుగుతున్నాయే తప్ప తగ్గుముఖం పట్టడం లేదు. దేశంలో గతేడాది నమోదైన మొత్తం క్రిమినల్‌ కేసుల్లో యూపీ అగ్రస్థానంలో నిలవడం గమనార్హం. అంతేకాదు.. హత్యల్లోనూ ఆ రాష్ట్రానిదే మొదటి స్థానం. లైంగికదాడుల కేసుల్లో బీజేపీ పాలిత రాష్ట్రం మధ్యప్రదేశ్‌ టాప్‌లో నిలిచింది. గతేడాది దేశవ్యాప్తంగా నమోదైన వివిధ కేసుల వివరాలను నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో(ఎన్‌సీఆర్‌బీ) గురువారం వెల్లడించింది. ఈ గణాంకాల ప్రకారం.. చాలా విభాగాల్లో బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే ఎక్కువ నేరాలు జరిగాయి. 2016లో దేశంలో మొత్తం 48,31,575 కేసులు నమోదు కాగా.. వాటిలో యూపీ నుంచి 4,58,993(9.5 శాతం) ఉన్నాయి. మధ్యప్రదేశ్‌లో 4,30,004(8.9 శాతం), మహారాష్ట్రలో 4,25,173(8.8 శాతం) కేసులు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా 30,450 హత్య కేసులు నమోదుకాగా.. యూపీ 4,889(16 శాతం), బీహార్‌ 2,581(8.5 శాతం), మహారాష్ట్ర 2,299(7.6శాతం) తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి. మహిళలపై లైంగికదాడుల కేసుల్లో(38,947) మధ్యప్రదేశ్‌(4,882) ముందు వరుసలో ఉండగా.. యూపీ, మహారాష్ట్ర తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. దళితులపై దాడుల్లో యూపీ, బీహార్‌, రాజస్థాన్‌ తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి. గతేడాదిలో ఐపీసీ సెక్షన్‌ కింద తెలంగాణలో 1,08,991, ఆంధ్రప్రదేశ్‌లో 1,06,774 కేసులు నమోదయ్యాయి. మహిళలపై వేధింపులు, లైంగికదాడుల కేసుల్లో దేశంలోని మెట్రో నగరాల్లోకెల్లా ఢిల్లీ తొలిస్థానంలో ఉన్నది.

దళితులపై పెరిగిన దాడులు

2016లో దళితులపై దాడులు 5.5 శాతం మేర పెరిగాయి. 2015లో దేశంలో దళితులపై దాడుల కేసులు 38,670 కేసులు నమోదు కాగా.. 2016లో 40,801 కేసులు నమోదయ్యాయి. యూపీలో అత్యధికంగా 10,426 కేసులు(25.6 శాతం) నమోదు కాగా.. బీహార్‌ 5,701(14 శాతం), రాజస్థాన్‌ 5,134(12.6) తర్వాతి స్థానంలో ఉన్నాయి. చిన్న పిల్లలకు సంబంధించిన కేసుల్లో(కిడ్నాప్‌, వేధింపులు, లైంగికదాడి) ఉత్తరప్రదేశ్‌, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌ ముందు వరుసలో నిలిచాయి. దేశంలో ఈ నేరాలు 13.6 శాతం పెరగడం గమనార్హం. సైబర్‌ నేరాలు కూడా యూపీ లోనే ఎక్కువగా(2,639 కేసులు) జరిగాయి. తర్వాతి స్థానంలో మహారాష్ట్ర, కర్నాటకలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా 2015తో పోలిస్తే గతేడాదిలో సైబర్‌ నేరాలు 6.3 శాతం పెరిగాయి.

Post a Comment

0 Comments