కదులుతున్న వ్యానులో గర్భవతిపై అత్యాచారయత్నం

 

కదులుతున్న వ్యానులో గర్భవతిపై అత్యాచారయత్నం 

వాహనంలో నుంచి దూకి మృతి తూప్రాన్‌:  
డీసీఎం వ్యానులో ప్రయాణిస్తున్న గర్భవతిపై ఇద్దరు వ్యక్తులు అత్యాచారయత్నానికి ఒడిగట్టడంతో వారి నుంచి తప్పించుకునేందుకు కిందకు దూకిన మహిళ మృతి చెందిన ఘటన తూప్రాన్‌ మండలం రావెల్లి శివారులో 44వ జాతీయ రహదారిపై జరిగింది. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటనకు సంబంధించి స్థానికులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. 

 మెదక్‌ జిల్లా తూప్రాన్‌ మండలం రావెల్లి పంచాయతీలోని పోతురాజుపల్లికి చెందిన రేగొండ, కళావతి(35) దంపతులు పాత బట్టల వ్యాపారం చేస్తూజీవనం కొనసాగిస్తున్నారు.శనివారం పాతబట్టలు విక్రయించేందుకు కళావతి మేడ్చల్‌ జిల్లా కొంపల్లికి తన కుమార్తె శిరీషతో కలిసి వెళ్లింది. వ్యాపారం ముగించుకుని శనివారం రాత్రి తూప్రాన్‌ వైపు వెళుతున్న డీసీఎం వ్యాను ఎక్కింది. ఈ క్రమంలో డీసీఎంలోని ఇద్దరు వ్యక్తులు కళావతి పట్ల అసభ్యంగా ప్రవర్తించి అత్యాచారానికి యత్నించారు. కళావతి దిగాల్సిన ప్రాంతంలో డీసీఎం వ్యాను ఆపకుండా వెళుతుండటంతో భయాందోళన చెందిన ఆమె వారి నుంచి తప్పించుకునేందుకు కదులుతున్న వ్యాను నుంచి బయటకు దూకింది. వ్యానులో ఉన్న వ్యక్తులు అరకిలోమీటరు దూరం వెళ్లిన తర్వాత కళావతి కూతురు శిరీషను దింపి వెళ్లిపోయారు. శిరీష తిరిగి తన తల్లి దగ్గరకు వచ్చి చూసేసరికి అపస్మారక స్థితిలో ఉంది. శిరీష సమీపంలోని దాబా వద్దకు వెళ్లి జరిగిన విషయం చెప్పింది. అక్కడికి చేరుకున్న స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అప్పటికే కళావతి మృతి చెందింది. అమెకు నలుగురు పిల్లలు ఉన్నారు. మృతురాలు ప్రస్తుతం ఏడు నెలల గర్భవతి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Post a Comment

0 Comments