గిరిజన విద్యార్థినిపై పాస్టర్‌ అఘాయిత్యం

  గిరిజన విద్యార్థినిపై పాస్టర్‌ అఘాయిత్యం


విజయనగరంః గిరిజన బాలికపై ఒక మతబోధకుడు లైంగిక దాడికి పాల్పడిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వసతి గృహంలో ఉంటున్న మరికొందరి విద్యార్థినులపైనా వికృత చేష్టలకు పాల్పడినట్లు బాధితులు విలేకర్ల ముందు వాపోయారు. బాధిత విద్యార్థినుల కథనం ప్రకారం... విజయనగరం జిల్లా సాలూరు మండలం మామిడిపల్లి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలకు చెందిన 19 మంది గిరిజన, దళిత బాలికలు  సమీపంలోని ఓ స్వచ్ఛంద సంస్థ (ఎన్‌జిఒ) ఆధ్వర్యంలో నడుస్తున్న లైట్‌హౌస్‌ క్రిస్టియన్‌ చిల్డ్రన్‌ హోమ్‌లో ఉంటూ చదువుకుంటున్నారు. ఆ వసతి గృహాన్ని వ్యవస్థాపకులు కె.వి.ప్రసాద్‌కుమార్‌, అతని కుమారుడు కె.వి.షారున్‌ నడుపుతున్నారు. వృద్ధాప్యంలో ఉన్న పాస్టర్‌ తరచూ విద్యార్థులను


తన విశ్రాంతి గదికి తీసుకెళ్లి బాడీ మసాజ్‌ చేయించుకుంటూ వికృత చేష్టలకు పాల్పడ్డాడు.     ఈ నేపథ్యంలో ఎనిమిదో తరగతి విద్యార్థినికి మూడు నెలల గర్భం దాల్చింది. పాస్టర్‌ ఆ విద్యార్థినిని పాఠశాలకు పంపకుండా సాలూరులోని తన నివాసంలోనే ఉంచాడు. నాలుగు రోజుల క్రితం ఆమె తల్లిదండ్రులు హాస్టల్‌కు వచ్చి కుమార్తె కనిపించకపోవడంతో ఆందోళన చెంది ఆరా తీశారు. పాస్టర్‌ తీసుకెళ్లారని సిబ్బంది చెప్పడంతో ఆయన ఇంటికి వెళ్లి కుమార్తెను తమ స్వగ్రామం మెట్టవలస తీసుకెళ్లారు. దీనిపై విలేకర్లు సోమవారం మెట్టవలస వెళ్లి ఆరా తీశారు. ఈ సందర్భంగా బాధిత బాలిక మాట్లాడుతూ విద్యార్థినులతో పాస్టర్‌ మసాజ్‌ చేయించుకుంటూ బెడ్‌రూమ్‌లోకి తీసుకెళ్లి వికృత చేష్టలు చేసేవాడని కన్నీరు పెట్టింది. మిగతా విద్యార్థినులు సైతం విలేకర్ల వద్ద పాస్టర్‌ అకృత్యాలను వివరించారు. పాస్టర్‌ కుమారుడు షారున్‌సైతం తమను లైంగికంగా వేధిస్తున్నాడని వాపోయారు. మెట్టవలస గ్రామస్తులు పాఠశాలకు వచ్చి ఉపాధ్యాయులను ప్రశ్నించారు. దీంతో పాఠశాల సిబ్బంది హోమ్‌ నిర్వాహకులను పాఠశాలకు పిలిచి నిలదీశారు.
       పాస్టర్‌ తప్పును పాఠశాల ఉపాధ్యాయులపైకి నెట్టే ప్రయత్నం చేయగా.. విద్యార్థినులంతా పాస్టర్‌, ఆయన కుమారుడు తమపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నా రని చెప్పారు. దీంతో ఉపాధ్యాయులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పాచిపెంట ఎస్‌ఐ సన్యాసి నాయుడు బాలికల నుంచి వివరాలు సేకరించారు. గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాల విద్యార్థినులకు వసతి కల్పించారు. బాలికపై అఘాయిత్యాన్ని పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని తోణాం సర్పంచ్‌ మువ్వల ఆదయ్య డిమాండ్‌ చేశారు. హాస్టల్‌కు వెళ్లి విద్యార్థినులను మహిళా కమిషన్‌ సభ్యులు కొయ్యాన శ్రీవాణి పరామర్శించి వివరాలడిగి తెలుసుకున్నారు.

Post a Comment

0 Comments