డీఈపై కాంట్రాక్ట‌ర్ దాడి

డీఈపై కాంట్రాక్ట‌ర్ దాడి

 గంటల వ్యవధిలోనే కాంట్రాక్ట‌ర్‌ను పట్టుకున్న పోలీసులు        అనంతపురం:  అనంతపురం పురపాలికలో డీఈగా పనిచేస్తున్న కిష్టప్పపై సోమవారం దాడికి పాల్పడిన గుత్తేదారు నరసింహారెడ్డిని పోలీసులు అరెస్ట్‌ చేశారు.  అనంతపురం నగరపాలక సంస్థలో  డిప్యూటీ ఇంజినీరుగా కిష్టప్ప పనిచేస్తున్నారు. నరసింహారెడ్డి.. చెత్త వూడ్చే యంత్రాన్ని నగరపాలక సంస్థకు సరఫరా చేసిన గుత్తేదారుడు. ఈ యంత్రంపై అనేక ఆరోపణలు రావడంతో అధికారులు బిల్లుల చెల్లింపు నిలిపేశారు. రెండు నెలల కిందట రూ.23 లక్షలు చెల్లించారు. మరో రూ.15 లక్షల వరకూ బిల్లు చెల్లించాల్సి ఉంది. చెల్లింపుల్లో జాప్యం చేస్తున్నారని విమర్శిస్తూ ఆ గుత్తేదారుడు నరసింహారెడ్డి తన మిత్రులతో కలిసి సోమవారం సాయంత్రం నగరపాలక సంస్థ కార్యాలయానికి వచ్చి పలువురు ఇంజినీర్లను దుర్భాషలాడాడు. అక్కడే ఉన్న డీఈ కిష్టప్ప జోక్యం చేసుకొని సభ్యతగా మాట్లాడాలని హితవు పలికగా.. నువ్వెవరు

చెప్పడానికి అంటూ ఎదురుతిరిగాడు. తీవ్ర పదజాలంతో దూషించాడు. అక్కడే ఉన్న ఉపకమిషనర్‌ సన్యాసిరావు, కార్యదర్శి జ్యోతిలక్ష్మి మందలించారు. కార్పొరేటర్‌ లక్ష్మిరెడ్డి అడ్డుకొని బయటకు లాక్కెళ్లారు.
           ఇది జరిగిన గంట తర్వాత డీఈ కిష్టప్ప ద్విచక్ర వాహనంపై ఇంటికి వెళ్తుండగా రఘువీరా టవర్స్‌ వద్ద నరసింహారెడ్డి ఆయన్ని అడ్డుకున్నాడు. రోడ్డుపైనే విచక్షణరహితంగా కొట్టాడు. తనను కొట్టొద్దని డీఈ ప్రాథేయపడినా వినలేదు. దాంతో ఆయన ఈ వ్యవహారంపై వన్‌టౌన్‌ పోలీసుస్టేషనులో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు గంటల వ్యవధిలోనే నరసింహారెడ్డిని పట్టుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగిపై దాడి చేసినందుకు వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు డీఎస్పీ వెంకట్రావు తెలిపారు. 

Post a Comment

0 Comments