సహనం గెలుస్తుంది

సహనం గెలుస్తుంది
Image by SnapwireSnaps from Pixabay 


సహనం శక్తి చేతితో సముద్రాన్ని
కొలిచేంతగా విస్తృతమైతే...
అంతిమ విజయం ఎపుడూ ప్రజలదే!

నిజమైన ప్రేమ ఓడిపోదు
ఎందుకంటే సహనం ఆ ప్రేమను 
అంతర్గత సూక్ష్మరూపమై రక్షిస్తుoది!

ప్రతికూల పరిస్తితుల్లోనూ బలమైన వెన్నెముక దాని సొంతం!

సూక్ష్మరూపం సూక్ష్మజీవితో యుద్ధం చేస్తోంది!
పంచభూతాలన్నీ ఒళ్లంతా కళ్లు చేసుకుని 
మానవ జాతిని చూస్తున్నాయి!

నిశ్శబ్దంలోని నిర్జీవ కణాలకు పర్వతాన్ని కదిలించేంత శక్తి 
ఉంది అని ప్రపంచానికి మొదటిసారి తెలిసింది!
ఇన్నాళ్లూ ద్వైతాన్ని అయిష్టంగా చూసిన అనంతం...
మనుషులు మనమంతా ఒక్కటే అని అద్వైత భావాన్ని 
ప్రేమిస్తుoటే నిండు మనస్సుతో ఆశీర్వచదిoచింది!

సాంద్ర నీహారముల రుచి పౌర్ణమి వెన్నెలకు  తీసిపోదని 
చకోరం తాళం వేసిన తలుపు వెనుక నుంచి చెప్పింది!

నిజమే నిజంగా ప్రపంచాన్ని మోస్తూ....
ఇన్నాళ్లూ అమావాస్య చీకటిలో కలిసిపోయిన 
మట్టి చేతులెన్నో కావ్యాలలో కొత్త నాయకులై వెలిశారు!

తెలుపే కాదు నలుపు కూడా రంగేనని....
చీకటి అందం వెలుగుకి అర్ధం అయ్యింది!
పారిశుధ్య కార్మికులు, డాక్టర్లు, నర్సులు, పోలీసులు 
మనమంతా ఒకటేనని ఒక్కటై 
యుద్ద వీరులై నడక మొదలు పెట్టారు!
సమాజ  శ్రేయస్సుకై ప్రాణాలకు తెగించి!

వలస కూలీల వెతలు, సంచార జీవుల కధలు, 
భిక్షుకుల కడుపు బరువు ప్రశ్నల ప్రహేళికై..
సమాజం పేగు కదిలించాయి!

మనసున్న మారాజులు చేతిలో ఎముకను తీసేశారు 
దానం దైవం ఒక్కటయ్యాయి!

మనిషి మనిషితో చేరి వ్యక్తి శక్తిగా మారే 
సుందర స్వప్నం వైపుకు చేతులు కలిపేలా ...
మహమ్మారి గండం మంచే చేసిందేమో!!

"నేను" కాదు "మనం" అని మనుషులు  అంటుంటే-
 "సమూహం"గా కదిలే చైతన్యం ముందు, 
కరోనా రక్కసి తోక ముడవదూ!
నిర్జీవ కణాలు నీరసించిపోవూ!

ప్రేమలోని సహనం బ్రహ్మాండాoత సంవర్ధియై 
విరాట్ రూపంగా మారినప్పుడు 
ప్రేమ గెలిచే తీరుతుంది!

సహనం చేతితో సముద్రాన్ని కొలుస్తుoటే ...
అంతిమ విజయం ఎపుడూ ప్రజలదే!

    -శ్రీనివాస రాజు పెన్మెత్స M.Phil 
           9550 981531