అనాదిగా వస్తున్న జానపదం!

  • ఉపాధి మార్గంగా ఎంచుకున్న వైనం
  • కళాకారుల పట్ల ప్రభుత్వాలకు చిన్నచూపు

మనిషి ఎంత పురాతనమైనవాడో జానపదకళలు అంతే పురాతనమైనవి. సమాజానికి వినోదాన్ని పంచినవి జానపద కళరూపాలేనంటే అతిశయో క్తి కాదు. జానపద పాటలు మేధా సంబంధి కాదు హృదయ సంబంధి. ప్రకృతితోనే తమ బతుకును ముడివేసుకున్న జానపదులు భావ జీవులు. నిసర్గ పరిసరాలలో జీవించే వారు కాబట్టి శృంగార హాస్యాలను కాని, శోక రౌద్రాలను కాని జానపదులు తీవ్రంగానే వ్యక్తం చేస్తారు. (ఆంధ్రుల జానపద విజ్ఞానం డాక్టర్. ఆర్వీఎస్.సుందరం). సరళ శిల్పంతో సాగిపోయే జానపద పాటలు అజ్ఞాత కర్తృత్వం, సామూహిక ప్రచారం, మౌఖిక సంప్రదాయం, ప్రాచుర్యం, సారళ్యం, అనేకుల మనస్సులను ఆకర్షించి సంపాదించిన జాతీయత అనే లక్షణాలు కల్గి ఉంటాయని చాంబర్స్ విజ్ఞాన సర్వస్వం తెలుపుతుంది. జానపద గేయాల్లో సృష్టికర్త అప్రధానుడై దాన్ని పాడిన గాయకుడు/గాయకురాలే ప్రధానం కావడం గమనార్హం. జానపద గేయాలకు పునరుక్తి ఒక గుణమనే చెప్పాలి.

పల్లవి, అనుపల్లవి, లయ విన్యాసం లేకుంటే జానపదునికి ఊపేరాదు. పనికి, పాటకున్న సంబంధాన్ని బట్టి పని పాటలే ముందు పుట్టాయని అంచనాకు రావచ్చు. ఏపుగా పెరిగిన పంటను చూసినపుడో, నిండు పున్నమినాడు వెన్నెల జలపాతంలో నిండుగా తడుస్తున్నప్పుడో, మనసైన చిన్నదాని అందం గుర్తొచ్చి ఒళ్లు పులకించిపోయినపుడో జాపపదుడు తనకు తెలియకుండానే ఏదో రాగం ఎత్తుకుని ఉంటాడు.12వ శతాబ్దానికి చెందిన పాల్కురికి సోమనాథుడు తన కాలం నాటి తుమ్మెద పదములు, ప్రభాత పదములు, పర్వత పదములు, ఆనంద పదములు, శంకర పదములు, నివాళి పదములు, వాలేశు పదములు, గొబ్బి పదములు, వెన్నెల పదములు.. మొదలైన పాటలను ప్రస్తావించాడు.

విన్నకోట పెద్దన రోకటి పాటల్ని తరువోజ పద్యాలన్నాడు. సురవరం ప్రతాపరెడ్డి, హరి ఆదిశేషువు, నేదునూరి గంగాధరం, బిరుదురాజు రామరా జు, యస్వీ జోగారావు, తూమాటి దోణప్ప, నాయని కృష్ణకుమారి, జి.ఎస్.మోహన్, ఆర్వీఎస్. సుందరం, మిక్కిలినేని రాధాకృష్ణమూ ర్తి, యెల్దండ రఘుమన్న, రుక్నుద్దీన్, గోపు లింగారెడ్డి, జయధీర్ తిరుమలరావు లాంటి పరిశోధకులు తెలుగు జానపద కళారూపాలనెన్నింటినో సేకరించి వాటి విశేషాలను, ప్రాధాన్యాన్ని, భద్రపరిచే పద్ధతులను తెలియజెప్పారు. జానపద గేయాలనగానే గుర్తుకు వచ్చేవి కోడివాయే లచ్చమ్మదీ.. కోడి పుంజువాయే లచ్చమ్మదీ.., అమ్మా బైలెల్లినాదో నాయనా తల్లీ బైలెల్లినాదో.. మాయదారి మైసమ్మో.. మైసమ్మా.. మనం మైసారం పోదామే మైసమ్మ.. , అత్తరు సాయిబు మంచోడమ్మా ఉత్తరమేసిండు.. మదనా సుందారి మదనా సుందారి.. లాంటి పాటలే.

విచిత్రంగా ఇవన్నీ తెలంగాణ ప్రాంతానికి చెందిన పాటలు. ఉత్తరాంధ్ర, రాయలసీమ జానపద గీతాలు కొన్ని వెండితెరకెక్కడం వలన ప్రాచుర్యం పొందాయి. దూరదర్శన్ కూడా కొన్ని ఎంపిక చేసిన జానపద గేయాలను అప్పుడప్పుడు ప్రసారం చేసింది. పొద్దున్నే లేచినాడు కాదరయ్య వాడు కాలు మొగం కడిగినాడు కాదరయ్య.. అంటూ ఒకప్పుడు కడప ఆకాశవాణిలో మారు మోగేది. ఆరివేటి శ్రీనివాసులు, కె.మునయ్య లాంటి రాయలసీమ జానపద కళాకారులు మారుమూల జానపద పాటలనెన్నింటినో వెలికితీసి ప్రచారం కల్పించారు. ఉత్తరాంధ్ర నుంచి జననాట్య మండలి కళాకారుడు, ఉత్తరాంధ్ర గద్దర్‌గా పేరు తెచ్చుకున్న వంగపండు ప్రసాదరావు ఆ ప్రాంతంలోని కొన్ని జానపద బాణీలలో విప్లవపాటలు రాసి, పాడి ప్రాచు ర్యం పొందాడు. ఈయన రాసిన పాటలలో ఏం పిల్లడో ఎళ్దామొస్తవా.., తరమెల్లి పోతున్నది..ఆనాటి స్వరమాగిపోతున్నదీ.., జజ్జనకరి జనారే... పాటలు బాగా పేరు పొందాయి.

ఏ ప్రాంత ప్రజల సాంఘిక జీవనం, సంస్క ృతి తెలియాలన్నా ఆ ప్రాంతానికి చెందిన జానపద కళల్ని ఆశ్రయించాల్సిందే. జానపద పాటట్లో ఇది మరింత చిత్రితమవుతుంది. తెలంగాణ కూడా ఈ సూత్రానికి భిన్నమైందేమీ కాదు. జాజర పాటలు, కోలాటపు పాటలు, బతుకమ్మ పాటలు, హోలీ పాటలు, వ్యవసాయ సంబం ధ పాటలు.. శతాబ్దాలుగా తెలంగాణ జానపదులకు ఆనందాన్ని అందిస్తూనే ఉన్నాయి. ఈ పాటలను పరిశీలిస్తే ఎన్నో సాంస్కృతిక విషయాలు బోధపడుతాయి. తెలంగాణ జానపద గేయ దీపానికి ప్రాణం పోసిన గాయక కవులు చాలా మందే ఉన్నారు. సుద్దాల హనుమంతు, బండి యాదగిరి, గద్దర్, గోరటి వెంకన్న, అందెశ్రీ, గూడ అంజయ్య, జయరాజు దాకా వందల మంది ఊరూరా పురుడుపోసుకొని తెలంగాణ సంస్కృతిని, పోరాటాన్ని, పలు సామాజిక సమస్యలను, ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని, ప్రపంచీకరణకు వ్యతిరేకంగా, కుల వివక్షకు వ్యతిరేకంగా, పల్లె విధ్వంసం మీద, పల్లె సోయగాలను, నెనరును, మర్యాదను, ప్రేమను జానపద పాటలుగా అల్లి తెలంగాణ జానపద గేయ సాహిత్యాన్ని సుసంపన్నం చేశారు.

ప్రజల సాహిత్యాన్ని ప్రజలకే అందించి ఊరు, పేరు లేకుండా అజ్ఞాతంగా ఉండిపోయిన రచయితలు, గాయకులు అనేక మంది ఉన్నారు. వస్తువును బట్టి, రస ప్రాధాన్యాన్ని బట్టి, సంబంధ బాంధవ్యాలను బట్టి, వయో భేదాలను బట్టి జానపద గేయాలను అనేక విభాగాలుగా విభజించుకోవచ్చు. ఏ విభజన అయినా అసమగ్రమే. అయినా విభజనచేసి అధ్యయనం చేయడం మనిషికి ఒక సౌల భ్యం. సాహిత్యం పరమావధి ఆనందం, ఉపదేశం అనే మాట వాస్తవమే. అయితే ఈ పనిని నూటికి నూరుపాళ్లు చేసేవి జానపద పాటలే. జీవితంలోని ప్రతి మలుపులో జానపదుడికి పాటే తోడుంటుంది. వాన కొట్టినా, కొట్టకున్నా, దుక్కి దున్నినా, నారుపోసినా, నాటుపెట్టినా, కలుపు తీసినా, చేను కోసినా, పంటకు కావలిపోయినా, బంతికట్టినా, కోరుకున్న ప్రియుడు/ప్రియురాలు దగ్గరయినా, దూరమైనా, వెన్నెల తనువులోని వేడిని మరింత పెంచినా, పండుగ శోభ మనసంతా నిండినా.. ఏ సన్నివేశంలోనైనా పాట పుట్టుకు వస్తుంది. తన దు:ఖాన్ని, సంతోషాన్ని, విషాదాన్ని పాటలోనే వ్యక్తీకరిస్తాడు జానపదుడు.

తెలంగాణ ప్రజల ఆరాటాలు, పోరాటాల్లోంచి వచ్చిన కొన్ని వేల జానపద పాటలు తెలంగాణ పల్లెల్లో మారు మోగాయి. ఇప్పటికీ పండుగల్లోనో, జాతర్లలోనో వినిపించి మన మనుసును దోచుకుంటాయి. ఒక్కసారి మనల్ని ఏదో లోకానికి తీసుకువెళ్తాయి. అలాగే తెలంగాణ ప్రజల అలంకార ప్రియత్వం, తెలంగాణ తెలుగు భాషా సౌందర్యం మన మనసును తాకుతాయి. అయితే రాను రాను భాషలు అంతరించిపోతున్నట్టే తెలంగాణ జానపద కళారూపాలు కూడా కనుమరుగైపోతున్నాయి. కొన్ని టీవీ ఛానళ్లు ప్రత్యేకంగా జానపద పాటల కార్యక్రమాలు నిర్వహిస్తూ మారుమూల జానపద గేయాల్ని వెలికి తీసి ప్రచారం కల్పిస్తున్నా, అది ఇంకా చాలా జరుగాల్సి ఉన్నది. ప్రదర్శించే కళాకారులు కూడా తగ్గిపోతుండడం విషాదం. బలమైన సాంస్కృతిక మద్దతుతో ప్రత్యే క తెలంగాణ రాష్ర్టాన్ని సాధించుకున్న నేపథ్యంలో కళాకారులకు జీవనభృతి కలిగించడంతోపాటు తెలంగాణ జానపద విశ్వవిద్యాలయం ఒకటి స్థాపించుకోవడం అవసరం. జానపద కళల్ని భద్రపరుచుకోవడం, ముందు తరానికి అందించుకోవడం చేయకపోతే క్రమంగా ఒక జాతి, దాని విశిష్ట సంస్కృతి కాలగర్భంలో కలిసిపోయే అవకాశం ఉన్నది.

Post a Comment

0 Comments