వందే భారత్ మిషన్‌లో ‘ఐఎన్ఎస్ మాగర్’


న్యూఢిల్లీ, మే 10: లాక్‌డౌన్‌ కారణంగా విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను విమానాలు, నౌకాదళ నౌకల ద్వారా, కేంద్ర ప్రభుత్వం స్వదేశానికి తీసుకువస్తోంది. 'సముద్ర సేతు ఆపరేషన్‌'లో భాగంగా, మాల్దీవులలో చిక్కుకుపోయిన భారతీయులను తిరిగి తీసుకువచ్చేందుకు ఆ దేశ రాజధాని మలే వెళ్లిన ఐఎన్‌ఎస్‌ మగర్‌, అక్కడ చిక్కుకుపోయిన భారతీయులందరినీ తీసుకుని బయల్దేరింది.

విదేశాలలో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి తీసుకువచ్చే 'వందే భారత్‌ మిషన్‌'లో భాగంగా భారత నావికాదళం 'ఆపరేషన్‌ సముద్ర సేతు'ను చేపట్టింది. తొలి విడతలో, మే 10 2020న, 698 మంది భారతీయులను ఐఎన్‌ఎస్‌ జలాశ్వ స్వదేశానికి చేర్చింది. రెండో విడతగా, మిగిలిన వారిని తీసుకుని ఐఎన్‌ఎస్‌ మగర్‌ మలే నుంచి బయల్దేరింది.

భారీ వర్షాల కారణంగా పరిస్థితులు అనుకూలించకపోయినా, తరలివచ్చే భారతీయుల రక్షణ కోసం నావికాదళం అన్ని ఏర్పాట్లు చేసింది. రెండో విడతలో 202 మంది తిరిగివస్తున్నారు. వీరిలో 24 మంది మహిళలు, ఇద్దరు గర్భిణులు, ఇద్దరు చిన్నారులు ఉన్నారు. వీరిలో తమిళనాడుకు చెందిన ఓ వ్యక్తి కాలు విరగ్గా, చికిత్స పొందుతూ తిరిగి వస్తున్నారు.

కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలు అనుసరించి, ప్రయాణీకులందరికీ కరోనా సంబంధిత వైద్య పరీక్షలు నిర్వహించారు. వారు వెంట తీసుకొస్తున్న సామగ్రిని క్రిమి రహితంగా మార్చారు. నౌకలో వారికి కేటాయించిన ప్రాంతాలవారీగా అందరికీ గుర్తింపు కార్డులు ఇచ్చారు. వారందరినీ కొచ్చి తీరానికి ఐఎన్‌ఎస్‌ మగర్‌ చేరుస్తుంది.

Post a Comment

0 Comments