భయపడాల్సిన పనిలేదు..


  • కరోనా వైరస్​ నుంచి కోలుకుంటున్నవారే ఎక్కువ మంది
  • నేటి నుంచి ఆటోమొబైల్​ దుకాణాలకు అనుమతి
  • ఉన్నత స్థాయి సమీక్షలు తెలంగాణ సీఎం కేసీఆర్​

భయపడాల్సిన పనిలేదు..
సమీక్షా సమావేశంలో మాట్లాడుతున్న సీఎం కేసీఆర్​

          కరోనా గురించి భయపడాల్సిన పనిలేదని, వైరస్​ సోకినా కోలుకుంటున్నవారే ఎక్కువ మంది ఉన్నారని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు తెలిపారు.  కరోనా కట్టడి, లాక్​డౌన్​ అమలు తీరు, సీజనల్​ వ్యాధులు ప్రబలకుండా తీసుకునే చర్యలపై మంత్రులు, ఉన్నతాధికారులతో సీఎం ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్​ మాట్లాడుతూ..  రాష్ట్రంలో కరోనా వైరస్​ కట్టడి చేశామని, హైదరాబాద్​లో మాత్రం నాలు జోన్లలో కరోనా యాక్టీవ్​ కేసులున్నాయని స్పష్టం చేశారు. ఈ నెల 17తో దేశవ్యాప్త లాక్​డౌన్​ ముగియనుండడంతో కేంద్ర ప్రభుత్వం ఇచ్చే మార్గదర్శకాలను పరిశీలిస్తామని తెలిపారు. అనంతరం రాష్ట్రంలో అనుసరించే వ్యూహాన్ని ఖరారు చేస్తామని తెలిపారు.  రానున్న వర్షాకాలంలో వచ్చే సీజనల్​ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. నగరంలోని ఎల్బీనగర్​, మలక్​పేట, చార్మినార్​, కార్వాన్​ జోన్లలోనే యాక్టీవ్​ కేసులున్నాయని, ఈ జోన్లలో 1442 కుటుంబాలు నివాసమున్నట్టు తెలిపారు.  రాష్ట్రంలో కరోనా వచ్చిన వారిలో మరణించిన వారి శాతం కేవలం 2.38 మాత్రమే. ఇది దేశ సగటు 3.5 శాతం కన్నా తక్కువ. కాబట్టి కరోనా గురించి అంతగా భయపడాల్సిన అవసరం లేదు. ఈ వైరస్ ఎంతకాలం ఉంటుందో కూడా తెలియదని,  కరోనాతో కలిసి జీవించే వ్యూహం అనుసరించక తప్పదన్నారు. హైదరాబాద్ నగరంలో బస్తీ దవాఖానాలకు మంచి స్పందన వచ్చిందని సీఎం అన్నారు. ప్రస్తుతం 123 బస్తీ దవాఖానాలు నడుస్తున్నాయని మరో 45 బస్తీ దవాఖానాలు వెంటనే ప్రారంభించాలని ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్​లను ఆదేశించారు.


నేటి నుంచి ఆటోమొబైల్​ దుకాణాలకు అనుమతి

రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ఉన్న ఏసీలు అమ్మే దుకాణాలతో పాటు ఆటో మొబైల్​ దుకాణాలకు శనివారం నుంచి అనుమతి ఇస్తున్నట్టు సమావేశంలో నిర్ణయం తీసుకున్నామని సీఎం కేసీఆర్​ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ కార్యాలయాలు, ఆర్టీఏ కార్యాలయాలు కొనసాగుతాయని, మిగతా లాక్ డౌన్ నిబంధనలు యధావిధిగా అమలవుతాయని చెప్పారు. ఈ ఉన్నత స్థాయి సమావేశంలో మంత్రులు ఈటల రాజేందర్,  కేటీఆర్​,  ఎర్రబెల్లి దయాకర్ రావు,  వేముల ప్రశాంత రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డీజీపీ  మహేందర్ రెడ్డి, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి  అరవింద్ కుమార్, ఎంఎయూడీ కమిషనర్  సత్యనారాయణ, పంచాయతీ రాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ సుల్తానియా, కమిషనర్ రఘునందన్ రావు, పోలీస్ కమిషనర్లు అంజనీ కుమార్,  సజ్జనార్,  మహేష్ భగవత్, సీనియర్ ఐపీఎస్ అధికారి  జితేందర్ తదితరులు పాల్గొన్నారు.