Hot Widget


 

Type Here to Get Search Results !

 


‘‘కరోనా శకం "

‘‘కరోనా శకం "
Image by Ursula Schneider from Pixabay 

ఇక క్రీస్తు శకం, క్రీస్తు పూర్వం కాదేమో..!
కరోనాకు ముందు, తరువాతే ... 

ఇది కరోనా శకం
కరోనా నేటి వాస్తవం
గంతులేస్తూ జింకల్లా గట్ల వెంట
చెట్ల వెంట ఆడాల్సిన పిల్లలు
నాల్గు గోడల మధ్య పచార్లు కొడుతుండ్రు
లక్షణంగా ముప్పొద్దుల ఊరి చుట్టూ తిరుగోటోళ్లు
సూర్యినితో పోటీపడుతూ
చంద్రుడొచ్చోఏళ్లకు ఇల్లు చేరేటోళ్లు
భూభ్రమణాన్ని మించిన వేగంతో పరిగెత్తేటోళ్లు
రయ్ రయ్ మంటూ రోడ్లకే వేగాన్ని నేర్పొటోళ్లు
తాములేకుంటే ఇక లోకమే జరగదని పలికేటోళ్లు
లేచిలేవగానే బడి బస్సు లెక్కోటోళ్లు
శ్రమ జీవుల నుండి బడా బాబుల వరకు
ఒక్కరేంది గల్లీ నుండి ఢిల్లీ వరకు -లోకమంతా
ఒక్కసారిగా కాళ్లకు బంధాలేసుకుండ్రు
బిక్కు బిక్కు మంటూ రోడ్లు -సిత్రంగా చిన్నబోయినయ్ .

కరోనా నీవు కరుడుకట్టిన కనిపించని చిత్రానివి .
అణువు అణుబాంబై మానవాళిని
మృత్యులోకాల చేరుస్తున్న మహమ్మారి .

ఊరు బయట -మఱ్ఱి చెట్టు ,భూతాలు
దయ్యాల కథలింక మాయమే .
నిన్నటిదాకా బంధాల విడిచి అనుబంధాల మరిచి
డబ్బు లోకంలో విహరిస్తూ కోర్కెల గుర్రాలెక్కి
ఒంటరి బతుకు కోరినోళ్లు
ఆరడుగుల జాగలో అంతమయ్యే శ్వాసకు
మోసే నల్గురు ఉండాలన్నపుడు
స్థాయి చూసి వెకిలిగా నవ్వినోళ్లు -
కరోనా నీ దెబ్బకు కంగుతింటు
నల్గురి కోసం వెతుకుతు
నేనే నన్న అహం పటాపంచలై
ఒంటరోళ్ళు అయ్యిన్రు
స్వీయ నిర్బంధం -
సామాజిక దూరం తో ప్రేమ జపం చేస్తున్రు .

కరోనా నీ కోరల్లో చిక్కి భూమి కిప్పుడు జ్వరమొచ్చింది
తన పిల్లల తప్పిదాల శాపమో ,పాపమో
నీ ఉత్పాతానికి ఊళ్ళు మూతపడ్డాయి
రాజ్యాలు తమ చుట్టూ తాము కంచ లేసుకున్నయ్ .

కరోనా -నీవు
మూడవ ప్రపంచ యుద్దానివా !
కల్కి క్రోధ రూపనివా !
ప్రకృతి ప్రళయ తాండానివా !
కుల మత ప్రాంత వర్గ వైషమ్యాల కతీతమైన
స్వీయ నిర్బంధ లోకాన్ని
సృష్టిని సృష్టించిన నీవు
అణువుతత్వ ఇజానివి - నేటి నిజానివి
రేపటి అతలాకుతలమైన
ఆర్ధిక వ్యవస్థ లో
జీవన గమ్యాల మార్చే కలి కల్మషానివి
ఇక కరోనా ఇది నీ శకమే
కరోనాకు ముందు.. కరోనా తరువాత..

(ఏది ఏమైనా నీన్నే కాదు .. నీ లాంటి ఏ ఉపద్రవానైనా మేము తిప్పికొడతాం ..
మట్టి మా ఆనవాలు .. విశ్వమానవ సౌభాగ్యమే మా కర్తవ్యం )

‘‘కరోనా శకం "
డాక్టర్ బండారు సుజాత శేఖర్,
దేవరకొండ, నల్గొండ జిల్లా,
98664 26640

Top Post Ad

Below Post Ad

Hollywood Movies