సడలింపులిచ్చినా.. ఆదాయం అంతంతే..!


  • వ్యూహాలను అనుసరించాలి..
  • తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్​రావు
  • ఆర్థిక పరిస్థితిపై ప్రగతిభవన్​లో సమీక్ష

సడలింపులు ఇచ్చినా ఆదాయం అంతంతే..
సమావేశంలో మాట్లాడుతున్న సీఎం కేసీఆర్​

లాక్​డౌన్​ సడలింపులు ఇచ్చినా తెలంగాణ ప్రభుత్వానికి ఆదాయం అంతంతే మాత్రంగా వచ్చిందని సీఎం కె. చంద్రశేఖర్​రావు తెలిపారు. బుధవారం ప్రగతిభవన్​లో రాష్ర్ట ఆర్థిక పరిస్థితిపై ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  రాష్ట్రం ఏడాదికి 37,400 కోట్ల రూపాయలను అప్పులకు కిస్తీలుగా చెల్లించాలని తెలిపారు. అప్పులను రీ షెడ్యూల్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరిందని, కానీ కేంద్రం ఆ పని చేయకపోవడంతో కిస్తీలు తప్పక కట్టాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పారు.

ఎఫ్.ఆర్.బి.ఎం. పరిమితి పెంచినప్పటికీ, కేంద్రం విధించిన అనేక షరతుల కారణంగా అదనపు రుణాలను సమకూర్చుకునే పరిస్థితి లేదని తెలిపారు. ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు పూర్తిగా చెల్లిస్తేనే మూడు వేల కోట్లకు పైగా వ్యయం అవుతుందని తగిన వ్యూహం అనుసరించాలని అధికారులకు సూచించారు.  తెలంగాణ రాష్ట్రానికి ప్రతీ నెలా 12వేల కోట్ల వరకు ఆదాయం రావాలని,  కానీ లాక్ డౌన్ కారణంగా ఆదాయం మొత్తం పడిపోయిందని తెలిపారు.  మే నెలలో కేంద్రానికి వెళ్లే పన్నుల్లో రాష్ట్ర వాటాగా రావాల్సిన 982 కోట్ల రూపాయలతో కలిపి కేవలం 3,100 కోట్ల రూపాయలు మాత్రమే వచ్చాయని చెప్పారు. 

రిజిస్ట్రేషన్లు, రవాణా తదితర రంగాల్లో ఆదాయం పెద్దగా రాకపోవడంతో కొంతమేర ఆదాయం వచ్చిందన్నారు.   ఈ సమావేశంలో  ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి  రామకృష్ణ రావు, సిఎంఓ ముఖ్య కార్యదర్శి నర్సింగ్ రావు, ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు.