నూకలు చెల్లినయి..

నూకలు చెల్లినయి..
Image by S. Hermann & F. Richter from Pixabay 

లోకం అంతమైతదంటే
మూడనమ్మకమనుకున్న
నాలుగూర్లు ఒక్కూరైతదంటే
నాలో నేనే నవ్వుకున్న
పిట్టలలెక్క జనం చస్తరంటే
పిలగాండ్ల మాటలనుకున్న
అన్నపూర్ణ నా దేశం
ఆకలికేకలెక్కడుంటయనుకున్న
ఆధునిక ధన్వంతరులున్న చోట
అనారోగ్యాల జాడెక్కడిదనుకున్న
అభివృద్ధిలో దూసుకెళుతున్నోళ్లం
ఆర్థిక సమస్యలు ఎట్లస్తయనుకున్న
లక్షలొచ్చె ఉద్యోగాలు లేకున్నా
లక్షణంగా బతుకుతున్నామనుకున్న
మేడమిద్దెలు కట్టుకోకున్నా
మూడు పూటల తింటున్నమనుకున్న
ఆడికార్లల్లా తిరగకున్నా
అందమైన జీవితమనుకున్న
కోట్లకు కోట్లు గడించకున్న
కుటుంబంతో కలిసుంటే చాలనుకున్న
కానీ
ఎందుకొచ్చినవో తెలువది
ఎలా వచ్చినవో తెలువది
ఆశలన్నీ అడియాశలు చేస్తివి
కరోనాపేరుతో కరుణలేకుండా
ఉసిళ్ల పురుగులలెక్క జనాల్ని చంపవడ్తివి
ఊపిరన్న పీల్చుకోనియకుండా
నాలుగుగోడల మధ్య బంధిస్తివి
కూలీనాలిచేసుకునేటోళ్లకు
కూడుదొరకకుండా కడుపుమాడ్తివి
మనిషిమనిషిని కలవకుండా
భౌతికదూరం పెడ్తివి
అభివృద్ధి చెందే దేశాన్ని
అదఃపాతాళానికి తొక్కితివి
సాధించుకున్న స్వాతంత్య్రం
నూరేళ్లు కూడా నిండకుండానే
మా నూరేళ్ల జీవితానికి
నూకలు చెల్లించవడ్తివి.

నూకలు చెల్లినయి..
మధుకర్ వైద్యుల,
యం.ఎ.,పీజీడిసీజే., హైదరాబాద్ 
 సెల్: 80966 77409, 91827 77409