స్వీయ రచన

 స్వీయ రచన
Image by PublicDomainPictures from Pixabay 


అంశం: దివ్యాంగులు


రేపటిరోజును 
పూయించాలని
అధైైర్యపు తోలును 
రిక్కరిక్కలుగా 
రాల్చుకుంటూ

ఆత్మ స్థైర్యపు తెడ్లను 
భుజాలకు కట్టి
అలవికాని కష్టాలతెప్పలతో
నిరంతరం కలబడుతూ..

చుట్టూ పరిచిన కటికచీకటిని
ఆత్మదీపంతో వెలిగించుకుంటూ

కుచించిన చూపుల్లో నలిగి
రుచించని జీవితాన్ని సైతం
సంకల్ప సిరాను ఒంపి 
స్వీయరచనలో 
జీవనపుటలను కుట్టుకుంటూ..

కాయ కష్టం ఆయుధంగా
మలిచిన దివ్యాంగులు
బలహీనతే కానరాని
బలవంతులు

వారి ఆకాశమంత 
ఆత్మవిశ్వాసం కింద
సర్వాంగాలు సక్రమంగా ఉన్నా..
స్వశక్తిపై నిలబడని
సోంబేరులెందరో
నాకు తారసపడుతుంటారు
కాలంతోనే నడిచేదారిలో...

.................................................................................................................................................................

        గీతాశ్రీ స్వర్గం
           మెదక్