తెలంగాణ రైతులు ప్రపంచంతో పోటీపడాలి


  • నియంత్రిత పద్ధతిలో పంట సాగే మేలు..
  • పండించిన పంటలకు మద్దతు ధర పొందాలి
  • తెలంగాణ సోనాకు మంచి డిమాండ్​
  • తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్​రావు
  • ఉన్నతాధికారులతో ప్రగతిభవన్​లో సమీక్ష

తెలంగాణ రైతులు ప్రపంచంతో పోటీపడాలి
సమీక్షా సమావేశంలో మాట్లాడుతున్న సీఎం చంద్రశేఖర్​రావు

హైదరాబాద్​:  విభిన్న నేలలు, సమశీతోష్ణ వాతావరణం, మంచి వర్షపాతం, వృత్తి నైపుణ్యం కలిగిన రైతులు, రైతు పక్షపాత ప్రభుత్వం లాంటి అనుకూలతలను సద్వినియోగం చేసుకుని తెలంగాణ రైతులు ప్రపంచంతో పోటీ పడే గొప్ప రైతాంగంగా మారాలని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్​రావు తెలిపారు.  నియంత్రిత పద్ధతిలో పంటలు సాగు చేసే విధానంపై చర్చించేందుకు గురువారం ప్రగతి భవన్ లో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు.  జిల్లాల నుంచి వచ్చిన అధికారులు, రైతు బంధు సమితుల అధ్యక్షులతో ముఖ్యమంత్రి ముఖాముఖి నిర్వహించారు.  ఈ సందర్భంగా  ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్​రావు మాట్లాడుతూ.. నియంత్రిత పద్ధతిలో పంటలు సాగు చేసి, రాష్ట్రంలోని రైతులంతా వందకు వంద శాతం రైతుబంధు సాయం, పండించిన పంటకు మంచి ధర పొందాలన్నది తన అభిమతమని తెలిపారు. మార్కెట్ లో మంచి డిమాండ్ కలిగిన నాణ్యమైన పంటలు పండించడం ద్వారానే రైతులు మంచి ధర పొందగలుగుతారని తెలిపారు. ఏ పంట వేయడంతో ఎంతో మేలు కలుగుతుందనే విషయంలో వ్యవసాయశాఖ, వ్యవసాయ యూనివర్సిటీ తగు సూచనలు చేస్తుందని, దాని ప్రకారం పంట సాగు చేస్తే రైతుకు ఏ ఇబ్బంది ఉండదని చెప్పారు. 

       రైతులంతా ఒకే పంట వేయడంతో  డిమాండ్ పడిపోయి నష్టపోతున్నారని రైతులకు సూచించారు. రాష్ట్రంలో గతేడాది వర్షాకాలంలో వరి పంట 40 లక్షల ఎకరాల్లో సాగు చేశారని,  53 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేశారన్నారు. ఈ సారి 70 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేయాలని,  గత ఏడాది దాదాపు 7 లక్షల ఎకరాల్లో కంది సాగు చేశారని తెలిపారు. ఈ సారి 15 లక్షల ఎకరాల్లో కంది సాగు చేయాలని,  సోయాబీన్, పసుపు, మిర్చి, కూరగాయలు తదితర పంటలు గత ఏడాది మాదిరిగానే వేసుకోవచ్చన్నారు.  తెలంగాణ సోనాకు మంచి డిమాండ్ ఉందని, 6.5 ఎంఎం సైజు కలిగిన బియ్యం రకాలను పండించాలని రైతులకు సూచనలు చేశారు. రాష్ట్రంలోని 2602 క్లస్టర్లలో నాలుగైదు నెలల్లో రైతు వేదికల నిర్మాణం పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. అన్ని రైతు వేదికల్లో ఎఇవోకు కార్యాలయం, కంప్యూటర్, వీడియో కాన్ఫరెన్సులు నిర్వహించుకోవడానికి వీలుగా టివి తదితర ఏర్పాట్లు ఉండాలని సీఎం చెప్పారు. ఈ సమీక్షా సమావేశంలో మంత్రులు, సీనియర్ అధికారులు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, కలెక్టర్లు, జిల్లా వ్యవసాయాధికారులు, జిల్లా రైతు బంధు సమితుల అధ్యక్షులు, వ్యవసాయ యూనివర్సిటీ అధికారులు, సైంటిస్టులు పాల్గొన్నారు.