‘మిడతల దండు’పై నజర్​


  • రాష్ట్ర సరిహద్దుల్లో అలర్ట్​
  • పర్యవేక్షించేందుకు ఐదుగురు సభ్యుల కమిటీ
  • సీఎం చంద్రశేఖర్​రావు
  • ప్రగతిభవన్​లో ఉన్నత స్థాయి సమావేశం

‘మిడతల దండు’పై నజర్​
ఉన్నత స్థాయి సమావేశంలో సీఎం చంద్రశేఖర్​రావు, తదితరులు

పంటలను నాశనం చేస్తున్న మిడతల దండును తెలంగాణలోకి రాకుండా ప్రత్యేక దృష్టి సారించినట్లు సీఎం కె.చంద్రశేఖర్​రావు స్పష్టం చేశారు. ప్రగతిభవన్​లో మిడతల దండు తెలంగాణ వైపు వస్తే ఎలా వ్యవహరించాలనే విషయంపై  ముఖ్యమంత్రి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహారాష్ట్ర, చత్తీస్ గఢ్ రాష్ట్ర సరిహద్దుల్లోని జిల్లాల కలెక్టర్లను, పోలీసు అధికారులను అప్రమత్తం చేసినట్లు, ఫైర్ ఇంజన్లను, జెట్టింగ్ మిషన్లను, పెస్టిసైడ్లను సిద్ధంగా పెట్టినట్లు చెప్పారు. మిడతల దండు కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తూ, అవి తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశించకుండా చూసే చర్యలను పర్యవేక్షించేందుకు ఐదుగురు సభ్యుల కమిటీని నియమించినట్లు చెప్పారు.

రాబోయే రోజుల్లో అవి ఎటువైపు వెళ్లే అవకాశం ఉందనే విషయాన్ని ఆరా తీశారు. రాజస్తాన్ ద్వారా  దేశంలోకి ప్రవేశించిన మిడతల దండు ప్రస్తుతం మహారాష్ట్రలోని భండార, గోండియా మీదుగా మధ్యప్రదేశ్ లోని బాలాఘాట్ వైపు వెళ్తున్నట్లు సమాచారం ఉందని అధికారులు తెలిపారన్నారు.  గాలివాటం ప్రకారం ప్రయాణించే అలవాటున్న మిడతల దండు, ఒకవేల గాలి దక్షిణం వైపు మళ్లితే చత్తీస్ గఢ్ మీదుగా తెలంగాణ వైపు వచ్చే అవకాశాలు కొన్ని ఉన్నాయని చెప్పారు. తక్కువ అవకాశాలున్నప్పటికీ తెలంగాణ రాష్ట్రంలోకి మిడతల దండు ప్రవేశించకుండా అన్ని ముందు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

ఈ సమావేశంలో సీఎస్ సోమేశ్ కుమార్, డీజీపీ  మహేందర్ రెడ్డి, ముఖ్య కార్యదర్శులు  బి. జనార్థన్ రెడ్డి,  ఎస్. నర్సింగ్ రావు, జయేశ్ రంజన్, పిసిసిఎఫ్  శోభ, డిసాస్టర్ మేనేజ్మెంట్ కార్యదర్శి రాహుల్ బొజ్జా, ఫైర్ డిజి  సంజయ్ కుమార్ జైన్, వ్యవసాయ యూనివర్సిటీ విసి  ప్రవీణ్ రావు, సిఐపిఎం ప్లాంట్ ప్రొటెక్షన్ ఆఫీసర్ డాక్టర్ ఆర్. సునిత, వ్యవసాయ యూనివర్సిటీ ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ ఎస్. జె. రహమాన్ తదితరులు పాల్గొన్నారు.