శిథిలాలు

Swathikumari శిథిలాలు
బండ్లముడి స్వాతికుమారి

మబ్బు
కరువుకళ్లని తెరిచిపెట్టి
రాత్రులని చేతులుగా చాచి
కలవరించింది నేను కదా?
కోరని కొండమీద
పురివిప్పి కురిశావెందుకు?

మట్టి
పొర పొరకి అడుగున
పురాస్మృతుల్ని పాతిపెట్టి ఉంటావు.
ఒక్క మొలకే ఆడిగావు కానీ
ఎన్ని పాత కథల్ని చీల్చుకు రమ్మంటావు?

ఉదయం
ఒకే అబద్ధాన్ని అనేకంగా
వాగ్దానామిస్తావు.
అపస్మారకంలోనే అన్నావని
అందరికీ తెలుసు.
నాకు మాత్రమే నమ్మబుద్ధవుతుంది.
ఎందుకని?

చేరి దూరమయ్యే ఆట-
పూరేకు కదా నీ ఒళ్ళు!
వెన్నరాస్తే వడలిపోదా?
ఈ ఒక్క ఆటకైనా
దెబ్బలవకుండా
ఇంటికి తిరిగొస్తావా మరి?


బండ్లముడి స్వాతికుమారి,
విజయవాడ.