25న నర్సాపూర్​ అటవీ ప్రాంతంలోని అర్భన్​పార్కులో మొక్కలు నాటనున్న సీఎం


  • మంత్రులు హరీష్​రావు, ఇంద్రకరణ్​రెడ్డిలు పరిశీలన
  • మంత్రులతో పాటు ఎమ్మెల్యే మదన్​రెడ్డి, కలెక్టర్లు, ఎస్పీలు..
  • ఆరో విడత హరితహారానికి 1083 మంది పోలీస్​ సిబ్బందితో బందోబస్తు

25న నర్సాపూర్​ అటవీ ప్రాంతంలోని అర్భన్​పార్కులో మొక్కలు నాటనున్న సీఎం
మంత్రులు హరీష్​రావు, ఇంద్రకరణ్​రెడ్డి, మెదక్​ ఎస్పీ చందన దీప్తి

25న నర్సాపూర్​ అటవీ ప్రాంతంలోని అర్భన్​పార్కులో మొక్కలు నాటనున్న సీఎం
పరిశీలిస్తున్న ఎస్పీలు చందన దీప్తి, చంద్రశేఖర్​రెడ్డి
మెదక్​ జిల్లా నర్సాపూర్​ అటవీ ప్రాంతంలో నిర్మించిన అర్బన్​ పార్కులో ఈనెల 25న ఆరో విడత హరితహారంలో భాగంగా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్​రావు మొక్కలు నాటనున్నారు. బుధవారం మంత్రులు హరీష్​రావు, ఇంద్రకరణ్​రెడ్డి, నర్సాపూర్​ ఎమ్మెల్యే మదన్​రెడ్డి, కలెక్టర్​ధర్మారెడ్డిలతో పాటు సంగారెడ్డి జిల్లా ఎస్పీ చంద్రశేఖర్​రెడ్డి, మెదక్​ జిల్లా ఎస్పీ జి. చందన దీప్తిలు  సీఎం కేసీఆర్​ మొక్కలు నాటనున్న ప్రాంతాన్ని పరిశీలించారు. 

ఈ సందర్భంగా ఎస్పీ చందనదీప్తి మాట్లాడుతూ..  ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు గురువారం హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించనున్న నేపథ్యంలో 1083 మంది పోలీస్ సిబ్బందితో పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అదేవిధంగా జిల్లాలో అతివేగంగా ప్రబలుతున్న మహమ్మారి  కరోనా కారణంగా, ముఖ్యమంత్రి యొక్క ఈ హరితహారం కార్యక్రమానికి ప్రజలు హాజరుకావద్దని, బదులుగా వారి సొంత గ్రామాలలో కనీస సామాజిక దూరం పాటిస్తూ, మాస్కులు ధరించి హరితహారం కార్యక్రమాన్ని నిర్వహించాలని, ఈ విషయంలో పోలీసు సిబ్బందికి సహకరించాలని ప్రజలను కోరారు. 

ఈ పటిష్టమైన పోలీస్ బందోబస్తు సంగారెడ్డి జిల్లా ఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి  ఆధ్వర్యంలో  1 అదనపు ఎస్.పి.( సంగారెడ్డి జిల్లా), 9మంది డి.ఎస్.పిలు, 34 మంది సి.ఐ/ ఆర్.ఐ.లు, 78 మంది ఎస్.ఐ లు, 110 మంది ఎ.ఎస్.ఐ/హెడ్ కానిస్టేబుల్ లు, 450 మంది కానిస్టేబుల్ లు, 25 మంది మహిళా కానిస్టేబుల్ లు, 15 మంది మహిళా హోంగార్డ్ లు, 176 మంది హోంగార్డ్ లు, బిడి టీం లు, 11 స్పెషల్ పార్టీ లు, డాగ్ స్క్వాడ్ లు, 10 రోప్ పార్టీల తో పకడ్బందీగా పోలీస్ సిబ్బంది ఉద్యోగ బాద్యతలు నిర్వహిస్తునట్లు ఎస్పీ చందన దీప్తి తెలిపారు. ఈ బందోబస్త్ ను 6 సెక్టార్ లు గా విభజించి, ఎలాంటి ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ఎక్కడికక్కడ ప్రత్యేక నియంత్రణ చర్యలు చేపట్టినట్లు తెలిపారు. అదేవిధంగా ముఖ్యమంత్రి కార్యక్రమం దృష్ట్యా నర్సాపూర్ పట్టణానికి వెళ్లే వాహనాలు ఉదయం 9 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు దారి మళ్ళించబడతాయని,  ప్రజలు పోలీస్ సిబ్బందికి సహరించాలని కోరారు.  ఈ కార్యక్రమానికి వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.