ఆమె మళ్ళీ జన్మించింది

ఆమె మళ్ళీ జన్మించింది
ఆమె మళ్ళీ జన్మించింది

కష్టాల వాకిట్లో కటిక చీకటి
ఆమె గుండె కిటికీల గుండా ప్రవేశించాలని

వేదనల వరదలో ముంచెత్తాలని
కలతల కరిమబ్బులతో కమ్మేయాలని
విలయాల వలయంలో పడదోయాలని
విరోధి విధికౌగిట్లో బంధీయైన ఆమె
కొంతకాలం గమ్యం తెలియని కెరటం

కంటిరెప్పలకు కునుకు కరువై..
గోడువినేవారులేక గుండెబరువై..
విధివక్రచూపు విసిరినా...
కన్నవారు నా అనుకున్నవారు 
చేరదీయకున్నా
ఎప్పుడూ కుంగిపోలేదు 
కూలీపోలేదు బడబాగ్నులను ఓర్చుతూ 
కడలిలా స్థైర్యంతో సాగింది

అనుభవాల పునాదులపై
అంతరంగాన్ని కొత్తగా ఆవిష్కరించుకుంది
కఠినకవచమొకటి హృదయానికి 
తొడగడం అలవర్చుకుంది
కొంగొత్త కలలను గుండెకుచుట్టి
ఆశయాల రెక్కలను పట్టుదలతో కట్టి
కొత్త జీవితాన్ని ఆరంభించింది
కాలాన్ని జయించింది..
ఇంకొకరు తనలా ఇక్కట్ల ఇరులలో 
ఇరుక్కోకూడదని
నూటిలో ఒక్కరిలా
ఆమె మళ్లీ  జన్మించింది

.....................................................................................
       గీతాశ్రీ స్వర్గం,

మెదక్​