అమావాస్య అలాగే ఉంది..

అమావాస్య అలాగే ఉంది.._harshanews.com
అమావాస్య అలాగే ఉంది..

వేల సంవత్సరాలు
చినుకుల్లా రాలి పడ్డాయి!
మహా పురుషులు వచ్చి వెళ్ళారు!
ఎన్నో మతాలను ప్రజలు
అటూ ఇటూ తిప్పారు!
ప్రవచనాలు, సమితిలు,
ధ్యాన మార్గాలు, కూటమిలు....
కొందరు ఇంకా సాగతీస్తున్నారు!

కానీ ---
ప్రజల జీవితాల్లో
అల్లకల్లోలం,
ఆకలి కేకలు,
అమావాస్య చీకట్లు
అలాగే ఉన్నాయి.

కొండలు క్షేత్రాలయ్యాయి!
గిరులు ప్రదిక్షిణాలయ్యాయి!
నదులు పుణ్య జలాలుగా మారాయి!

కానీ ప్రజల మనస్సులు
క్రమశిక్షణకు అలవాటు పడలేదు!
ఒక గంటసేపు కుదురుగా కూర్చోలేరు!
అసహనం అర క్షణానికోసారి!

ప్రార్ధనా మందిరాలలోనూ అపవిత్ర ఆలోచనలే!
ఆదర్శాలన్నీ మాటల కోటల ప్రాకారాదులకివతలే!
చెప్పడం మా వంతు చెయ్యడం ప్రపంచం వంతు,
 మీ వంతు, ఇదుగో ఈ పాలకుల వంతు అని
ఉద్యమకారుల, సామాజిక కార్యకర్తల
గొంతుల్లోని అహంకారపు అరుపులు
అమావస్య చీకటిలోని గాఢాంధకారాన్ని మించిపోయాయి!

చీకట్లు తొలగిపోవాలి!
మంచి నిజమైన సాధనా మార్గాల వైపునకు
మానవజాతి అడుగులు కదుపుతుందని నమ్ముదాం!
అలా చేయి పట్టి నడిపించే వైతాళికుడే నిజమైన దేవుడు!

నడుద్దామా మరి!

అమావాస్య అలాగే ఉంది.._harshanews.com
 శ్రీనివాస రాజు పెన్మెత్స 
 9550 981 531