పదవ తరగతి విద్యార్థులంతా ‘పాస్​’


  • ప్రస్తుత పరిస్థితుల్లో నిర్వహణ అసాధ్యం
  • పై తరగతులకు ప్రమోట్​ చేయాలని ఆదేశం
  • తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్​రావు
  • ప్రగతిభవన్​లో విద్యాశాఖ అధికారులతో సమీక్ష

పదవ తరగతి విద్యార్థులంతా పాస్​_harshanews.com
ఉన్నతాధికారులతో మాట్లాడుతున్న సీఎం కేసీఆర్​

హైదరాబాద్​: పదవ తరగతి విద్యార్థులకు శుభవార్త.. పరీక్షల విషయంలో గత కొన్ని రోజులుగా విద్యార్థులు సతమతమవుతున్నారు.. ఎట్టకేలకు వారికి ప్రభుత్వం శుభవార్త అందించింది. ప్రగతిభవన్​లో ఉన్నతాధికారులతో తెలంగాణ ముఖ్యమంత్రి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న ప్రస్తుత తరుణంలో 10వ తరగతి పరీక్షలు నిర్వహించడం అసాధ్యమని, ఎలాంటి పరీక్షలు నిర్వహించకుండానే విద్యార్థులను పై తరగతులకు ప్రమోట్ చేయాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. గతంలో పాఠశాలల్లో నిర్వహించిన ఇంటర్నల్ అసెస్మెంట్ పరీక్షల్లో వచ్చిన మార్కుల ఆధారంగా వచ్చే గ్రేడులను పరిగణలోకి తీసుకుని పదవ తరగతి విద్యార్థులను పై తరగతికి ప్రమోట్ చేయాలని చెప్పారు. రాష్ట్రంలో 5,34,903 మంది 10వ తరగతి విద్యార్థులున్నారు. మొత్తం ఆరు సబ్జెక్టులు, 11 పేపర్లుండగా, అందులో రెండు సబ్జెక్టులకు సంబంధించిన 3 పేపర్ల పరీక్షలు పూర్తయ్యాయి. ఆ సమయంలో రాష్ట్ర హైకోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం పదవ తరగతి పరీక్షలను వాయిదా వేసింది. వాయిదా వేసిన పరీక్షలకు సంబంధించి తదుపరి నిర్ణయం తీసుకోవడానికి సోమవారం ఉన్నత స్థాయి సమావేశాన్ని సిఎం నిర్వహించారు. ఈ సమావేశంలో పదవ తరగతి పరీక్షల విషయంలో దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాలు అనుసరించిన పద్ధతులను పరిశీలించారు. తెలంగాణలో ఏమి చేయాలనే విషయంలో సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం తెలంగాణలో అనుసరించాల్సిన పద్దతిని ఖరారు చేశారు.  ఈ సమావేశంలో విద్యాశాఖ మంత్రి  సబితా ఇంద్రారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి  చిత్రా రామచంద్రన్, సిఎంఓ ముఖ్య కార్యదర్శి ఎస్.నర్సింగ్ రావు పాల్గొన్నారు.