నియంత్రిత సాగుతో బహుళ ప్రయోజనాలు


  • ముందు చూపు ఆలోచనతో నిర్ణయం
  • గొప్ప వ్యవసాయ రాష్ట్రంగా తెలంగాణ
  • తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు

నియంత్రిత సాగుతో బహుళ ప్రయోజనాలు_harshanews.com
సమావేశంలో మాట్లాడుతున్న సీఎం కేసీఆర్​

హైదరాబాద్​: నియంత్రిత సాగుతో బహుళ ప్రయోజనాలు పొందవచ్చని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్​రావు తెలిపారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘నియంత్రిత సాగు కేవలం ఒక పంట కోసమో, ఒక సీజన్ కోసమో ఉద్దేశించిన విధానం కాదని చెప్పారు. తెలంగాణలో వ్యవసాయ విప్లవం చోటు చేసుకుంటున్న నేపథ్యంలో ముందు చూపుతో ఆలోచించి రాబోయే కాలంలో ధాన్యం అమ్మకం మొదలుకొని అనేక కోణాల్లో ఉత్పన్నమయ్యే సమస్యలను, పరిష్కారాలను దృష్టిలో పెట్టుకొని రైతు శ్రేయస్సే కేంద్రబిందువుగా సమగ్ర వ్యవసాయ అభివృద్ధి విధానం రూపొందించినట్లు తెలిపారు.  ఈ యాసంగిలో ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్.సి.ఐ) దేశవ్యాప్తంగా లక్షా 15 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించిందన్నారు. ఇందులో 64 లక్షల టన్నులు తెలంగాణ నుంచే సేకరించిందని, దేశం మొత్తంలో 55శాతం ధాన్యం తెలంగాణ నుంచే సేకరించిందని చెప్పారు. తెలంగాణ అద్భుతంగా పురోగమించి గొప్ప వ్యవసాయ రాష్ట్రంగా రూపుదిద్దుకుంటుందనడానికి పెరిగిన వ్యవసాయ ఉత్పత్తి గొప్ప తార్కాణం.’’ అని ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్ రావు పేర్కొన్నారు. ‘‘రాబోయే రోజుల్లో కాళేశ్వరం, సీతారామ, పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టులు పూర్తయి కోటి 30 లక్షల ఎకరాలలో బంగారు పంటలు పండించే దిశగా తెలంగాణ పురోగమిస్తుందని తెలిపారు. గతంలో పంజాబ్ రాష్ట్రం వ్యవసాయరంగంలో గణనీయమైన అభివృద్ధి సాధించి, దేశంలోనే ప్రథమ స్థానాన్ని సాధించింది. అయితే పంటల మార్పిడి విధానం అవలంబించకపోవడంవల్ల పంజాబ్ లో వ్యవసాయ వైపరీత్యం (పంజాబ్ డిజాస్టర్) సంభవించిందని చెప్పారు. పంజాబ్ అనుభవం ద్వారా వచ్చిన గుణపాఠాలను అధ్యయనం చేసిన రాష్ట్ర ప్రభుత్వం అటువంటి సమస్యలేవీ తెలంగాణలో ఉత్పన్నం కాకుండా ఉండేవిధంగా నియంత్రిత సాగు విధానానికి రూపకల్పన చేసిందని ముఖ్యమంత్రి వివరించారు.