ఊహలకు రెక్కలొచ్చే..


ఊహలకు రెక్కలొచ్చే.._harshanews.com
Image by Enrique Meseguer from Pixabay 

ఊహలకు రెక్కలొచ్చాయి -
ఆకాశం మేఘాలని సిద్దం చేసింది
ప్రకృతి ఆకుపచ్చ చీర దాల్చి
విరబూసే పుఫలాల పంటలతో
సీతాకోకచిలుకగా పులకించింది.

గలగలపారే ఏర్లు ,
కిలకిలరావాల ఖగాలు,
తీరొక్క శబ్దాల వన్య ప్రాణులు
హలాల ఎద్దుల డిక్కలు ,
సృజన యంత్రాలు ,
నాట్ల పాటల్లో ఇంద్రధనుస్సులు
కొలిమి క్రాంతి చక్రమైనది..

ఊరు ఇప్పుడు సృజనాత్మకజాగృతి ;
నిలువునా కృంగదీసిన -పేదరికం
అనుబంధం, వృత్తి బంధం
కూలిన పెంకుటిల్లు ,
వృద్దులు చిరునామాగా -కరువు కాటకంతో
అల్లాడిన -పల్లె -గ్రామం -(దేశం )
నేడు -నాటి గాంధీ కలల్ని నిజం చేసింది..

పొట్టచేతబట్టి
వలసెల్లిన పక్షులకు
ఆహ్వానమిచ్చి, స్వశక్తితో ఊరికి ఊపిరై
యువతీయువకుల్ని తమ కాళ్లపై
నిలబడమంది -పెద్దల అనుభవాలు
పిల్లల కోర్కెలు స్వరాజ్యసాధనకు
ఆయుధం చేసింది..

ఇది గ్రామస్వరాజ్యం..
ఇక్కడ స్వరాజ్యమంటే ..
తమ ఉనికిని తాము
కాపాడుకోవడం -బంధాల ముంగిట్లో
వనరుల్ని ప్రయోజనం చేయడమే..

చదువుసంధ్యలు,విజ్ఞాననిధులు
పెట్టుబడిదారులకు ధార పోయక
జీవితాల్ని తామే నిరూపించుకోవడం
తపన నిజమవ్వడమే -
ఊహలకు రెక్కలొచ్చాయి..

ఇప్పుడు మనం
పునాదులకు వెళ్ళాలిసిందే -
మరో గ్రామ స్వరాజ్యానికి
రెక్కలు తొడగాల్సిందే .
...................................................................................................ఊహలకు రెక్కలొచ్చే.._harshanews.com
డాక్టర్ బండారు సుజాతశేఖర్ 
 హైదరాబాద్​
 98664 26640