"పల్లెతల్లి తడుస్తోంది"

pallethalli thadusthondi_harshanews.com
"పల్లెతల్లి తడుస్తోంది"


పల్లెతల్లి తడుస్తోంది ...
రైతన్నల కన్నీటితో...
ఆకలి కేకల ఆర్తనాదాలతో
పదుగురికన్నం పెట్టే చక్రవర్తి
రుణమాఫీల కాకుల లెక్కల్లో
చెయ్యి చాచి నిలుస్తున్నాడు మరి….

పేరుకన్నదాతలు ...
ఆకలి పొంతకు కౌలుదార్లు
మట్టిని నమ్ముకుంటారు...
బ్రతకలేనప్పుడు దుప్పటిగా కప్పుకుందామని…..

నిద్రాహారాలు మాని
చెమటనే పంటనీటిగా మార్చి
 ఆరుగాలాలు శ్రమించి దుక్కి దున్నితే
కల్తీవిత్తనాలూ ….కరుణించని మేఘాలూ
అప్పులకుప్పలూ…..ఆకలి తిప్పలూ…..

పొంత కూడు లేకున్నా
పరువుకోసం పాకులాడే రైతన్న
పురుగును చంపలేని మందులతో
కడుపు నింపుకుంటున్నాడు….

నెర్రెలు విచ్చిన భూమాతలా …
పాద యాత్రలో పగిలిన పాదాలు
పొరలు పొరలుగా విచ్చుతుంటే….
ప్రభుతను ప్రశ్నించేందుకు మాత్రమే… పరుగెడతాడు

ఎందుకోయీ అమాయక రైతన్నా
నువ్వు విద్యార్ధివి కాదు కదయ్యా ….
సమ్మెలు చేసేందుకు
తీవ్రవాదివీ కాదు కదయ్యా …..
వాహనాలు తగలెట్టి రచ్చ చేసేందుకు
సర్కారుని ప్రశ్నించేందుకూ
రాస్తా రోకోలు చేసేందుకూ
నువ్వు కనీసం ప్రజా ప్రతినిధివి కూడా కాదు కదా…

నోరు లేని రైతన్నవు ....
కండువాక్కట్టుబడే గాంధేయ కొమ్మవు
పల్లెకు ప్రశ్నవీ...పట్టణాలకు బడుగువీ

మనిషినే పండించగల పొలానివేమో నువ్వు
అందుకే అన్ని పంటలకూ ఎరువుగా
నిఖార్సైన నీ తనువునే కప్పెడతావు

అందుకేనేమో…

జై కిసాను నినాదం
పంటపొలాల్లో ఎరువయ్యింది
నీకేమో బ్రతుకు కరువయ్యింది...

రైతన్నా ఇకనైనా మేలుకో...
ప్రభుతను నిలదీసే చట్టసభల్లో చేరుకో
భావి తరాలకైనా మట్టిని నమ్ముకునే స్థితిని కలిగించు ...
నీకై నీవే ఉద్యమించు .... అన్నదాత ఆక్రందనలు నిర్మూలించు....
సమాజానికి అండా దండా నీవనే నిజాన్ని నిరూపించు...


pallethalli thadusthondi_harshanews.com
పద్మ కుమారి పి.
హైదరాబాద్​.