ప్రభుత్వానికి ‘జీ తెలుగు’ చేయూత  • కరోనా కట్టడికి పోరాటంలో మేము సైతం అంటున్న ఉద్యోగులు
  • వైద్య పరికరాలను అందజేసేందుకు ముందుకొచ్చిన ‘జీ నెట్​వర్క్​’
  • ‘జీ తెలుగు’ ప్రతినిధులను  ప్రశంసించిన ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్​

etela rajender_harshanews.com
మంత్రి ఈటల రాజేందర్​కు చేయూత వివరాలను అందిస్తున్న జీ తెలుగు ప్రతినిధులు అనురాధ, శ్రీధర్​

హైదరాబాద్​: కరోనా మహమ్మారితో చాలా వ్యవస్థలు కుదేలు కావడంతో చాలా మంది ఉపాధిని కోల్పోయారని జీ తెలుగు బిజినెస్​ హెడ్​ అనురాధ గూడూరు, సీనియర్​ హెచ్​ఆర్​ బిజినెస్​ పార్టనర్​(సౌత్​) శ్రీధర్​ మూలగడ తెలిపారు. మంగళవారం తెలంగాణ ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్​ను కలిసి కరోనా కట్టడికి జీనెట్​వర్క్​తరుఫున వైద్య పరికరాలను అందజేయనున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి ఈటల రాజేందర్​ మాట్లాడుతూ.. కరోనా నివారించేందుకు తమ వంతు సాయంగా  ‘జీ తెలుగు’ వైద్య పరికరాలను అందించేందుకు ముందుకురావడం ప్రశంసనీయమన్నారు.  కరోనాను నియంత్రించేందుకు వైద్యులు, పోలీసులు, సామాజిక కార్యకర్తలు ఎంతో కృషి చేస్తున్నారని తెలిపారు. ప్రజల్లో అవగాహన పెంచేందుకు ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా తీసుకోవాలని సూచించారు.

అనంతరం  బిజినెస్​ హెడ్​ అనురాధ గూడూరు, సీనియర్​ హెచ్​ఆర్​ బిజినెస్​ పార్టనర్​(సౌత్​) శ్రీధర్​ మూలగడ  మాట్లాడుతూ.. కరోనాతో ప్రజలు ఎంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వారిని ఆదుకునేందుకు జీ నెట్​వర్క్​ దేశంలోని 10 నగరాల్లో వైద్య పరికరాలను అందజేస్తుందన్నారు. అందులో భాగంగానే తెలంగాణ ప్రభుత్వానికి  4,000 పీపీఈ కిట్లు, 16 అంబులెన్స్​లు,  మాస్క్‌లు, ఇతర వైద్య పరికరాలు ఇచ్చేందుకు ముందుకొచ్చినట్లు తెలిపారు.  కోవిడ్‌ మహమ్మారిపై పోరాడేందుకు ‘జీ తెలుగు’ చేస్తున్న ప్రయత్నాలను ట్విట్టర్‌లో తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ లైక్‌ చేశారని గుర్తు చేశారు. దేశవ్యాప్తంగా 10,000 మంది వలస కార్మికులకు మద్దతుగా 200 అంబులెన్సులు, 40,000 పిపిఇ కిట్లు, 100 పోర్టబుల్ ఐసియులు, 6లక్షల రూపాయలు రోజువారీ భోజన ఖర్చుని విరాళంగా ఇవ్వడం ద్వారా దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక అధికారులకు మద్దతు ఇస్తున్నట్లు చెప్పారు. 

నోయిడా, ముంబై, చండీగఢ్‌, జైపూర్, కోల్‌కతా, భువనేశ్వర్, బెంగళూరు, హైదరాబాద్, కొచ్చి, చెన్నై నగరాల్లో జీ నెట్‌వర్క్‌ తన సహాయ కార్యక్రమాలను నిర్వహిస్తోందని పేర్కొన్నారు.  జీ తెలుగులో ప్రసారమయ్యే 16 కార్యక్రమాల ద్వారా రూ.35 లక్షలను దాదాపు 400 కుటుంబాలకు అందించిందని తెలిపారు. అంతేకాకుండా మొదటి దశ లాక్‌డౌన్‌ సమయంలో టీవీ కార్మికుల కోసం ‘జీ తెలుగు’, ‘జీ సినిమాలు’ ఉద్యోగులు రూ.1,50,000 విరాళంగా అందించారని వారందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.