ఈ చీకటి నన్నేం చేయగలదు

ఈ చీకటి నన్నేం చేయగలదు
ఈ చీకటి నన్నేం చేయగలదు

ఈ చీకటి నన్నేం చేయగలదు
మౌనంతో నా ఆక్రోశాలను
వెల్లడించుకునే స్వేచ్ఛనివ్వడం తప్ప


ఈ చీకటి నన్నేం చేయగలదు
వెన్నెలమ్మ చలువలో జాబిలి వెలుగుని
మబ్బుల సాయంతో మూసేయడం తప్ప


ఈ చీకటి నన్నేం చేయగలదు
తనకన్నా భయంకరమైన
మనుష్యులున్న సమాజంలో
బ్రతుకుతున్నందుకు నాపై జాలిపడ్డం తప్ప


ఈ చీకటి నన్నేం చేయగలదు
ఎక్కడో ఏ అభాగినిపైనో
మృగత్వం కమ్మిన కీచక సంతతి
ఏ అఘాయిత్యం చేయబోతోందో
అనే కీచురాళ్ళ శబ్దాలకు వంతపాడడం తప్ప


ఈ చీకటి నన్నేం చేయగలదు
ఎక్కడో గడ్డకట్టే చలిలో సైతం
దేశసరిహద్దుల్లో ఆకలిదప్పులు మరచి
కావలి కాస్తున్న నా సోదర జవానులను
వెన్నుపోటు పొడవాలనుకునే
దుష్ట ముష్కరులను దాచిపెట్టడం తప్ప


ఈ చీకటి నన్నేం చేయగలదు
దుష్టశక్తులకు ఊతమిచ్చేలా
తన వన్నె మలచిన

గ్రహ గమనాలను తిట్టుకోవడం తప్ప

..............................................................................................................

ఈ చీకటి నన్నేం చేయగలదు
పద్మ కుమారి పి.
హైదరాబాద్​