ఒడిసెల రాయి

ఒడిసెల రాయి_harshanews.com
ఒడిసెల రాయి  

తొలుస్తున్న మెదడు లోంచి
పుట్టిన బాణం ప్రశ్న
ఇది రెండక్షరాలే..కావొచ్చు
రెండులక్షల అవరోధాలైన
విప్పేదాకా విశ్రమించదు
గిరాగిరా తిప్పి విసిరిన
ఒడిసెల రాయే ప్రశ్న
లక్ష్యాన్ని చేరేదాక
వెను తిరుగని తపంచా ఇది

జవాబుదేముందీ
ప్రశ్నవెంట
తోకూపుకుంటూ కుక్కపిల్లలా రావలసిందే..
అందుకే..ప్రశ్నించాలంటేనే..
దమ్మూధైర్యం..సత్తాఉండాలంటాను
ప్రశ్న.. పలుకోణాలు
బహురూపాలు

ఒక ప్రశ్న
చైతన్యం లోంచి ఉదయించి
వెలుగును వెంటతెస్తుంది

ఒక ప్రశ్న
అసమానతల్లోంచి పుట్టి
అగ్నిపర్వతమై పేలుతుంది

ఒక ప్రశ్న
జిజ్ఞాస లోంచి ఉదయించి
కొత్త తొవ్వలకు తెరలేపుతుంది
ప్రజలను మేల్కొలిపిన
సోక్రటీస్ అస్త్రాలన్నీ ప్రశ్నలే మరి
ప్రశ్నించే సత్తా కొరవడినప్పుడే
కర్మసిద్ధాంతం తెరలేచినట్లుంది..
అందుకే..
పాఠం తో పాటూ
ప్రశ్నించడమూ నేర్పుతుంటా..
మా పిల్లలకి..

ఎందుకూ..ఏమిటీ..ఎక్కడా.. అంటాననే..
కొందరికి నేను
మింగుడుపడని చేదు మాత్రను.
అన్నట్లు
నన్ను నేను ప్రశ్నించుకుంటాను.
కాబట్టే..
ఒక జాతి  జండాలా
తలెత్తుకొని నడుస్తున్నా..!
.....................................................................................................................
ఒడిసెల రాయి_harshanews.com
నాంపల్లి సుజాత
98480 59893

.