నమ్మకం కుదరడం లేదు

నమ్మకం కుదరడం లేదు
నమ్మకం కుదరడం లేదు 

సినిమాలు, షికార్లు, పబ్బులు
విందులు, వినోదాలు
 ఉద్యోగాలు, బాధ్యతలు
వాహనాలు, ప్రయాణాలు
గొడవలు,  అల్లర్లు, హత్యలు
పంతాలూ,  పట్టింపులూ
మోసాలు, ద్వేషాలు, రోషాలు
అహంకారాలు,అన్యాయాలుసభలు,
సమ్మేళనాలు,వాదనలు
పండుగలు, ధర్నాలు, దౌర్జన్యాలు
వంటి వార్తలు లేని సమాజాన్ని
కాదు కాదు ప్రపంచాన్ని
చూస్తుంటే
"నమ్మకం కుదరడం లేదు"

బీదా, ధనిక, కులం
మతం, భాష
ఊరూ, వాడా,  పట్టణం
స్త్రీలు, పురుషులు
అమెరికా , యూరప్, కువైటు
 చైనా, ఇటలీ
 చిన్నా , పెద్దా , ముసలి
 బాబూ , బేబీ
 టివీలు, పేపర్లు, చానళ్ళు
ఫేసుబుక్కూ,యూట్యూబులు
 'కరోనా'నామజపం చేయడం
"నమ్మకం కుదరడం లేదు"

మాయ చేసినట్లుగా మంత్ర మేసినట్లుగా
మనుషులంతా ఇంటి పట్టునే
ఉండడం
బిక్కు బిక్కు మని బతకడం
ఆస్తులు , అంతస్తులు
హోదాలు, ఆభరణాలు
కోట్ల కొద్దీ డబ్బులు
వీటన్నింటిపై వ్యామోహం లేకుండా జీవించడం
గమనిస్తూ ఉంటే
"నమ్మకం కుదరడం లేదు"

ప్రజలందరూ ఒక్కసారిగా
"ఓ .సీ .డీ " రోగులవడం
అతి శుభ్రత పాటించే
మహానుభావులు కావడం
భార్యా పిల్లలతో తమ వారితోనే
రోజుల కొద్దీ గడపడం
సోకులు, మోజులు ఏవీ లేక
సాధారణంగా బతకడం
దుష్ట ఆలోచనలు అపార్ఠాలు
సరదాకైనా లేకపోవడం
అస్సలు
"నమ్మ బుద్ది కావడం లేదు"

ఇలా ఇలా టి వీలు చూస్తూ
ప్రధాన మంత్రి , ముఖ్య మంత్రి
ఏమి చెప్తారో చూద్దాం అదే చేద్దాం అని ఏకత్రాటిపై
నిల్చిన అఖండ భారతాన్ని
అనుసరిస్తున్న ప్రజానీకాన్ని
కంటికి కనిపించని సూక్ష్మజీవికి
గడ గడ లాడుతున్న
గందరగోళ ప్రపంచాన్ని
గతి తప్పిన ప్రకృతి కూడా  ఒక్కసారిగా "తూచ్"
అన్నట్లుగా స్వచ్ఛంగా మారుతుంటే
"నమ్మకం కుదరడం లేదు"

కరోనా ఖతం అయింది
సూక్ష్మ జీవిపై మానవ విజయం
ప్రపంచ మంతటా
విజయోత్సవాలు
చరిత్ర తిరగ రాసినమానవులు
మహమ్మారిని అంతం
చేసిన శాస్త్రజ్ఞులు
అంటూ టి వీ లు మార్మోగుతున్నాయి
ఇది కలనా ? అని
" నాకు నమ్మకం కుదరడం లేదు "
అయినా నా కల నిజం కావచ్చు
రవి గాంచని చోట కవి గాంచున్
అంటారు కదా నిజమే అవుతుందేమో ఏమో మరి !
"నమ్మకం కుదరడం లేదు"


 ....................................................................................................
నమ్మకం కుదరడం లేదు
పూదత్తు కృష్ణ మోహన్
 ఎస్.ఏ తెలుగు , సైకాలజిస్టు
జడ్చర్ల.